రాఖీతో అన్నకు అంతిమ వీడ్కోలు
చిప్పగిరి: మృతిచెందిన అన్నకు రాఖీ కడుతున్న ఈ దశ్యం ఎంతో హదయ విదారకంగా ఉంది కదూ! అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా చెప్పుకునే రక్షాబంధన్ రోజు నేమకల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నేమకల్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మాల పెద్దలక్ష్మన్న(62) కొన్ని నెలలుగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాడు. చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రయివేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మతిచెందాడు. ఇతనికి యశోదమ్మ, ఈరమ్మ, నరసమ్మ అనే ముగ్గురు చెల్లెలు. ఉదయం వెళ్లి అన్నకు రాఖీ కట్టాలనుకున్న వీరికి పెద్దలక్ష్మన్న మతి విషయం తెలిసింది. కష్టసుఖాల్లో తోడుగా ఉండే అన్న ఇక లేడని విషాదాన్ని దిగమింగుతూ రాఖీ కట్టి అంతిమ వీడ్కోలు పలికారు. అన్నాచెలెల్ల అనుబంధం గొప్పతనాన్ని చాటారు.