-
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆరెగూడెం బాధిత రజకులు
-
అండగా నిలిచిన ప్రజా సంఘాల నాయకులు
నేలకొండపల్లి: మండలంలోని ఆరెగూడెంలో రజక కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేయాలని గ్రామపెద్దలు కొందరు టముకు వేయించడం, పనులకు పిలవకుండా దూరంగా ఉంచడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నెల 27వ తేదీన గ్రామస్తులు సమావేశమై 28వ తేదీ జరుపుకునే ముత్యాలమ్మ పండుగ వేడుకలో సల్లకుండ పట్టుకొని రజకులు ఇంటింటికీ తిరగాలని గ్రామపెద్దలు ఆదేశించగా..ఉన్న పది కుటుంబాల్లో వృద్ధులు తిరగలేరని, చదువుకున్న యువకులు ఆ పని చేసేందుకు నిరాకరిస్తున్నారని సదరు రజకులు చెప్పడంతో..కొందరు గ్రామ పెద్దలు ఆగ్రహించారు. రజకులందరినీ సాంఘిక బహిష్కరణ చేస్తున్నామని, వీరితో పని చేయించుకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని 27వ తేదీన టముకు వేయించడంపై సోమవారం మీడియాలో కథనాలు రావడంతో..ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో కూడా ఇలా అవమానించడం, ఆత్మగౌరవం దెబ్బతీయడం తగదని, సదరు గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పండగపూట ఊరి రజకులంతా..ఏడుస్తూ, బహిష్కరణ అవమానంతో బాధ పడుతూ గడిపారని..ఈ దుశ్చర్య బాధాకరమని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు.
ఆరెగూడెంలో పది కుటుంబాల రజకులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..పలు సంఘాల నాయకులు నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై పి.దేవేందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావుకు విన్నవించారు. ఎస్సై గ్రామంలో విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పలు ప్రజాసంఘాల నాయకులు సోమవారం ఆరెగూడెం గ్రామాన్ని సందర్శించి బాధిత రజకులను కలిసి మాట్లాడారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, గౌరవ అధ్యక్షుడు తమ్మారపు బ్రహ్మాయ్య, బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీలక్ష్మి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నందిపాటి మనోహార్, ఎమ్మార్పీఎస్ నేత వంగూరి ఆనందరావు, పీవైఎల్ రాష్ట్ర నాయకులు సీౖÐð .పుల్లయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకన్న, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు భద్రునాయక్, ఇప్టూ నేత పగిడికత్తుల రామదాసు తదితరులు బాధితులను కలిసిన వారిలో ఉన్నారు.
రజకులను బహిష్కరించడం బాధాకరం. ఆరెగూడెం సంఘటనలు పునరావృతం కావొద్దంటే బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
–పాగర్తి సుధాకర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు.
ఊరిలో గతంలో మాదిరి బట్టలు ఉతికేందుకు వెళితే గ్రామ పెద్దలు రావద్దంటున్నారు. టముకు వేయించి..అవమానించిండ్రు. బాధగా ఉంది.
–ఎలిమినేటి వీరమ్మ.ఆరెగూడెం.
సత్తుపల్లి రూరల్: ఆరెగూడెంలో పది రజక కుటుంబాలను గ్రామ పెద్దలు సాంఘిక బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో రజకసంఘం నాయకులు మోటార్‌సైకిల్ ర్యాలీ తీసి, రింగ్‌సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి..నినాదాలు చేశారు. సీఐ పి.రాజేంద్రప్రసాద్‌కు, తహసీల్దార్ దొడ్డా పుల్లయ్యకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి తెలగారపు అప్పారావు కోరారు. కార్యక్రమాలలో చింతల సత్యనారాయణ, ఈలప్రోలు రామ్మూర్తి, కోటా సత్యనారాయణ, టోపీ శ్రీను, బి.శ్రీనివాసరావు, మరికంటి సత్యనారాయణ, రాయల కోటేశ్వరరావు, కానూరి శ్రీనివాసరావు, పగిళ్ల చెన్నయ్య పాల్గొన్నారు.