నూజెండ్ల మండలం గురప్పనాయుడిపాలెం గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యం
తాగునీటి ప్లాంట్ వద్దకు రానివ్వని వైనం
వినుకొండ (నూజెండ్ల): పోలింగ్ ముగిసినప్పటికీ టీడీపీ నేతల ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతున్నది. వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని ఓ ఎస్సీ కాలనీ వాసులను సామాజిక బహిష్కరణ చేయడమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం గురప్పనాయుడిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారని గ్రామంలో మంచినీటి ప్లాంట్ వద్దకు రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు వినుకొండ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడును గురువారం కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం గ్రామానికి చెందిన మాశిపోగు వసంతరావు, దూపాటి లింగయ్య, పాలెపోగు యోబు, మాణిక్యరావుతోపాటు పలువురు కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద తాగునీరు పట్టుకోవడానికి వీలులేదని, పొలం పనులకు పిలవబోమని, కౌలుకు భూములు ఇవ్వబోమని, కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై ఎస్సీ కమిషన్ తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
సామాజిక బహిష్కరణ చేయడం దారుణం : ఎమ్మెల్యే బొల్లా
గురప్పనాయుడు పాలెం ఎస్సీ కాలనీ వాసులకు తాగునీరు ఇవ్వకుండా, పనులకు పిలవకుండా బహిష్కరించడం దారుణమని ఎమ్మెల్యే బొల్లా అన్నారు. కాలనీ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. గ్రామంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment