ప్రాణరక్షణలో ప్రథమ చికిత్స కీలకం
రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు
జస్టిస్ లక్ష్మణరావు
గుంటూరు మెడికల్: ప్రథమ చికిత్స ప్రాణరక్షణలో ఎంతో కీలకమని, ప్రమాదం జరిగిన మొదటి పది నిమిషాలు గోల్డెన్ పీరియడ్‌గా, ఆ సమయం రోగి ప్రాణం నిలపటంలో ఎంతో దోహదపడుతుందని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ గౌరవాధ్యక్షుడు జస్టిస్ డాక్టర్ లక్ష్మణరావు అన్నారు. నాలుగురోజులుగా గుంటూరు జిల్లా పరిషత్ కాంపౌండ్‌లోని రెడ్‌క్రాస్ కార్యాలయంలో జరుగుతున్న ప్రథమ చికిత్స, ప్రథమ స్పందన శిక్షణ శిబిరం ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణ పొందిన వారు ఓర్పుతో, సహనంతో సేవలందించాలని కోరారు. గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ వడ్లమాని రవి మాట్లాడుతూ నవ్యాంధ్రలో రెడ్‌క్రాస్ సేవలు ఇంకా విస్తృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జీవైఎన్ బాబు, తెనాలి కార్యదర్శి భానుమతి, వినుకొండ కార్యదర్శి ప్రసాద్, కో–ఆర్డినేటర్ అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.