సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలి
Published Thu, Sep 8 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
నెల్లూరు రూరల్ : మత్స్యకార సొసైటీలను ఏర్పాటు చేసుకొని, ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరాలని జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సీతారామరాజు సూచించారు. మత్స్యశాఖ కార్యాలయంలో ముద్ర రుణాలపై సొసైటీ సభ్యులకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్స్యపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గతేడాది 23.52 లక్షల చేపలు ఉత్పత్తయినా, వార్షిక తలసరి వినియోగం 9.5 కిలోల చేపల మేరే ఉందన్నారు. దీన్ని 13 కిలోలకు పెంచడం ద్వారా పోషకాహార లోపాలన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మార్కెట్‌లో తాజా చేపల అమ్మకం, ఎండు చేపల విక్రయం, హార్బరులో రిక్షాపై చేపల రవాణా, సంచార చేపల వాహనం, రిటైల్ దుకాణం, బతికిన చేపల అమ్మకం, ఎండు చేపల పరిశ్రమ, చేపల కియోస్క్, తదితర యూనిట్లను ముద్ర రుణాలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రావు మాట్లాడారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని సూచించారు. మత్స్యకార మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. రుణాలను సద్వినియోగం చేసుకుని, సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలన్నారు. మత్స్యశాఖ గూడూరు ఏడీ లక్ష్మీనారాయణ, ఎఫ్‌డీఓ చాంద్‌బాషా, కాలేషా, బీసీ కార్పొరేషన్ ఈడీ, బ్యాంకు అధికారులు, సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement