డొంకూరు మత్స్యకారుల సమస్యలను వింటున్న రెడ్డి శాంతి
మత్స్యకారులపై వివక్ష
Published Sat, Sep 24 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపాటు
డొంకూరు మత్స్యకారులకు ఓదార్పు
డొంకూరు(ఇచ్ఛాపురం రూరల్): మత్స్యకారులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన రాయితీలు, భృతి చెల్లించడంలో టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు. శనివారం డొంకూరులో పర్యటించి మత్స్యకారులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్ మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన హామీలు బంగాళాఖాతంలో కలిసిపోయాయని ఎద్దేవా చేశారు. చేపల వేట విరామ సమయంలో ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన 1320 మంది మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతి ఇంతవరకు చెల్లించకపోవడంలో ఆంతర్యమేంటని ఆమె ప్రశ్నించారు.
జిల్లాలో కనీసం ఒక్క శాసనసభ సీటును కూడా మత్స్యకారులకు కేటాయించలేకపోయిందని దుయ్యబట్టారు. 18 మంది మత్స్యకారుల పెన్షన్ తొలగించడం దారుణమన్నారు. గ్రామానికి రోడ్లు నిర్మించలేదనీ, చేపలను ఎండబెట్టేందుకు ప్లాట్ ఫారాలను, కోల్డ్‌స్టోరేజ్‌లను నిర్మిస్తామంటూ చెప్పిన నేతలు ఇప్పుడు మోహం చాటేస్తున్నారని సర్పంచ్ ప్రతినిధి బుడ్డ జానకిరావు, కాంతారావులు వైఎస్‌ఆర్ సీపీ నేతల వాపోయారు. మత్స్యకార సమస్యలపై సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వారంతా తీర్మానించారు.
కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, జిల్లా అధికార ప్రతినిధి పూడి నేతాజీ, రాష్ట్ర యువత కార్యదర్శి నవీన్ అగర్వాలా, కంచిలి ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, మాజీ ఎంపీపీలు కారంగి మోహనరావు, ఎం.గణపతి, పి.తిలక్, మత్స్యకార ప్రతినిధులు సూరాడ పాపారావు, బుడ్డ కాంతారావు, జానకిరావు, ఇచ్ఛాపురం, సోంపేట మండల కన్వీనర్లు పిట్ట ఆనంద్, తడక జోగారావు, గుమ్మడి రాందాస్ యాదవ్, బతకల భాస్కరరావు, ఆర్.చిట్టిబాబు, ఎస్సీ మండల కన్వీనర్ బాగ మోహనరావు, లోపింటి దుర్యోధన, కృష్ణారెడ్డి, మోహనరావు, రామేశ్వరరావు, పి.ప్రభాకర శేశయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement