మహమ్మద్ ప్రవక్త మార్గం అనుసరణీయం
మహమ్మద్ ప్రవక్త మార్గం అనుసరణీయం
Published Mon, Dec 12 2016 7:54 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
– కర్నూలులో ఘనంగా మిలాద్–ఉన్–నబీ వేడుకలు
– నగరంలో ముస్లింల భారీ ర్యాలీ
– రాజ్‌విహార్ సెంటర్‌లో బహిరంగ సభ, మిలాద్ పతాకావిష్కరణ
– ప్రముఖుల హాజరు
కర్నూలు(రాజ్‌విహార్): మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం అనుసరణీయమని అహ్లె సున్నతుల్ జమాత్ కార్యదర్శి సయ్యద్ షఫి పాషా ఖాద్రి అన్నారు. ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం కర్నూలులో మిలాద్–ఉన్–నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాతబస్తీలోని లతీఫ్ లావుబాలి దర్గా ప్రాంతం నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు ముస్లింలు భారీ ప్రదర్శనతో వచ్చారు. రోజా దర్గా, కొత్తపేట తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన ర్యాలీలు స్థానిక కిడ్స్ వరల్డ్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలిశాయి. ఇందులో వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం రాజ్‌విహార్ సెంటర్‌లోని మిలాద్ చౌక్‌లో అహ్లె సున్నతుల్ జమాత్ కార్యదర్శి సయ్యద్ షఫి పాషా ఖాద్రి అధ్యక్షతన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో చివరి ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా అని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గాల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీలు బుట్టా రేణుక, టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్ ఖాన్, హజరత్ లతీఫ్ లావుబాలీ దర్గా సజ్జాదేనషీన్ ఖలీఫాయే అక్బర్ సయ్యద్‌షా హాషిం ఆరిఫ్ పాషా ఖాద్రి అతిథులుగా హాజరై ప్రసంగించారు.
– ప్రవక్తది శాంతి మార్గం : బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ
మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గాలు శాంతికి దోహదపడతాయి. హిందూ, ముస్లింల ఐక్యతకు కర్నూలు నగరం గొప్ప చిహ్నం అని, దీనిని ఇలాగే కొనసాగించాలి. ఒకరికొకరు ప్రేమలు పంచుకుంటూ కలిసి పండుగలు చేసుకోవాలి. ప్రవక్త మద్యం, వడ్డీ వ్యాపారం వంటి వాటికి నిషేధం విధించడం, మహిళలకు సమున్నత స్థానం కల్పించడం మంచి పరిణామాలన్నారు.
– సర్వమానవాళి సంక్షేమానికి కృషి చేశారు : టీజీ వెంకటేష్, ఎంపీ
మహమ్మద్ ప్రవక్త సర్వ మానవాళి సంక్షేమం కోసం కృషి చేశారు. ఆయన జీవితం ఆదర్శనీయం. కర్నూలు ప్రజలు కుల మతాలకు అతీతంగా జీవిస్తున్నారు. వ్యాపారాలు, సేవా, సహాయ కార్యక్రమాలను కలిసే చేసుకుంటున్నారు. అందరూ బాగుండేందుకు ఈ మార్గం ఉత్తమమైంది.
మహమ్మద్ ప్రవక్త గొప్ప వారు : ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే
మహమ్మద్ ప్రవక్త చాలా గొప్ప వ్యక్తి. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముస్లింలు బతకడం అభినందనీయం. బక్రీదు, వినాయకచవితి పండుగలు ఒకే సారి వచ్చినా కలిసిమెలిసి చేసుకోవడం నగర ప్రజల మత సామరస్యానికి ప్రతీక.
ముస్లింల మార్గదర్శి : హఫీజ్ ఖాన్, వైఎస్‌ఆర్ సీపీ కర్నూలు సమన్వయకర్త.
మహమ్మద్ ప్రవక్త (స.అ.స.) ముస్లిం జీవితాలకు మార్గదర్శి. 1,24,000 ప్రవక్తల్లో మహమ్మద్ ప్రవక్త గొప్పవారు. భార్య, భర్త, తండ్రి కొడుకులు, తోటి వాళ్లు ఇలా అన్ని వర్గాల బంధాలను తెలిపిన మహనీయులు. తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నదని చాటిచెప్పి మహిళకు సమాజంలో మహోన్నత స్థానం కల్పించారన్నారు. ఆయన ఐదుపూటల నమాజు ఒక్కటే కాదు దేశభక్తిని కూడా నేర్పారు.
– ఆయన విశ్వప్రవక్త: సయ్యద్‌షా ఆరిఫ్‌పాషా ఖాద్రి
మహమ్మద్ ముస్లింలకే కాదు, విశ్వానికే ప్రవక్త. శత్రువులను సైతం కరుణించే గొప్ప మనస్తత్వం ఆయనది. ఆదిదంపతులు ఆదమ్, హవాల సంతతి కావడంతో ఎవరెన్ని చెప్పినా మనమంతా సోదరులమే.
– ఘనంగా మిలాద్ పతాకావిష్కరణ..
లతీఫ్ లావుబాలి దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ అబ్దుల్లా హుసేని బాద్‌షా నేతృత్వంలో రాజ్‌విహార్ సెంటర్‌లోని జుల్ఫిషా, చందేషా దర్గాలో మిలాద్ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ మిలాద్ కమిటీ అధ్యక్షుడు బి.ఇంతియాజ్ అలీ ఖాన్‌తో పాటు కమిటీ సభ్యులు, దర్గాల పీఠాధిపతులు, ముతవల్లులు సయ్యద్ అన్వర్‌బాష ఖాద్రి, సయ్యద్ దాదాబాష ఖాద్రి, వైఎస్‌ఆర్ సీపీ జాయింట్ సెక్రటరీ తెర్నకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీ సెల్ కార్యదర్శి ఎస్‌ఎ రహిమాన్, నగర కార్యదర్శి నూరుల్లా ఖాద్రీ, నాయకులు నజీర్ ఆహ్మద్ ఖాన్, నజీర్ ఆహ్మద్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement