కాలం చెల్లిన వంటనూనెతో పలువురికి అస్వస్థత
మంచాల: కాలంచెల్లిన వంటనూనెతో చేసిన ఆహార పదార్థాలు తిని.. పలువురు అస్వస్థతకు గురైన సంఘటన మంచాలలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నారెడ్డి విజయ్‌భాస్కర్ ఇంట్లో ఓ శుభకార్యం ఉండడంతో శ్రీగణేష్ సూపర్‌మార్కెట్లో దుకాణంలో గోల్డెన్ ప్యూర్ కంపెనీ పేరుతో ఉన్న మంచినూనె ప్యాకెట్లను ఆదివారం కొన్నాడు. వీటితో ఆహార పదార్ధాలు తయారుచేశారు. అయితే భోజనం చేస్తున్న సమయంలోనే ఓ రకమైన వాసన వచ్చిందని తెలిపారు. అప్పటికే అన్నం తిన్న ఐదారుగురు వాంతులు చేసుకోవడంతో.. ఇదేమిటా? అని పరిశీలించారు.
తేదీ దాటిపోయిన నూనెను వాడడం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించుకున్నారు. 2015 ఆగస్టు 8న ప్యాక్ చేసిన నూనెను 6 నెలలలోపే విక్రయించాలి. కానీ 10 నెలలు దాటిన నూనెను వ్యాపారి తమకు అంటగట్టాడని విజయ్‌భాస్కర్ మండిపడ్డారు. ఈ విషయమై దుకాణదారుడి వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మంచాల సీఐ గంగాధర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వచ్చి సూపర్‌మార్కెట్లో పరిశీలించగా పది నెలల కాలం దాటిన ఆయిల్ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు సీఐ తెలిపారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.