పింఛన్ కోసం నడుచుకుంటూ వెళుతున్న వృద్దులు
రూకల కోసం.. నడకయాతన
Published Thu, Aug 11 2016 12:42 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
– ప్రతి నెలా వేలల్లో పంపిణీ కాని పింఛన్లు
– అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు
– ఆఫ్‌లైన్‌పై దృష్టి పెట్టని అధికారులు
– పింఛన్‌దారులకు తప్పని వెతలు
ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ఫలితంగా ప్రతి నెలా వేలాది మంది లబ్ధిదారులకు పింఛన్ అందడం లేదు. పింఛన్‌దారులు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్తుండడంతో ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే..పంపిణీ సిబ్బంది అసలు తమ ఇళ్ల వద్దకే రావడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా అంతిమంగా వేలాది మందికి పింఛన్ కష్టాలు తప్పడం లేదు.
అనంతపురం టౌన్ :
ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య 2,00,778 మంది, వితంతు 1,19,042, వికలాంగ 55,572, చేనేత 11,240, కల్లుగీత పింఛన్‌దారులు 194 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు వెలుగు సీసీలు మొత్తం 1,261 మంది పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 1–5లోపు పూర్తి చేయాలని ఆదేశాలున్నా అది సాధ్యం కావడం లేదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా అమలు కావడం లేదు.
ఆఫ్‌లైన్‌పై దృష్టి పెట్టని అధికారులు
పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో పింఛన్ అందించేందుకు 15 నిమిషాల వరకు పడుతోంది. మరికొన్ని చోట్ల రెండు, మూడు రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది.
దీంతో పాటు పింఛన్ పంపిణీ సిబ్బంది వేరే ప్రాంతాల నుంచి వస్తుండడంతో సకాలంలో ప్రక్రియ పూర్తి కావడం లేదు. వాస్తవానికి సంకేతాలు అందని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో పంపిణీ చేసి, ఆ తర్వాత డేటాను ఆన్‌లైన్‌లో నమోదు‡ చేసే అవకాశముంది. ఈ విషయంలో చాలా మంది ఎంపీడీఓలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైగా సకాలంలో పూర్తి చేయాలన్న నిబంధనతో చాలాచోట్ల పంచాయతీ కేంద్రంలోనే పంపిణీ చేపడుతున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల వృద్ధులు, వికలాంగులు వ్యయ ప్రయాసలకోర్చి అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. కొన్ని పంచాయతీ కేంద్రాలు దూరంగా ఉండడం, రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇలాంటి చోట్ల నరకయాతన అనుభవిస్తున్నారు.
22,936 మందికి అందని పింఛన్
ఆగస్టుకు సంబంధించి 3,86,826 పింఛన్లు మంజూరవగా.. పంపిణీ చేసింది 3,63,926. అంటే 22,936 మందికి అందలేదు. మిగులు మొత్తం రూ.2,63,07,000. ఆగస్టులోనే కాదు.. ప్రతి నెలా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది.
ఆరు నెలలుగా పింఛన్ తీసుకోని వారి వివరాలు
నెల మంజూరైన పింఛన్లు అందుకోని వారు
మార్చి 3,88,983 25,152
ఏప్రిల్ 3,87,043 18,283
మే 3,87,759 21,973
జూన్ 3,87,654 17,631
జూలై 3,87,479 20,359
ఆగస్టు 3,86,826 22,936
ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలన్న ఆదేశాలున్నాయి
పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలన్న ఆదేశాలున్నాయి. ప్రస్తుతానికి నడవలేని స్థితిలో ఉన్న వారికి వాళ్ల ఇంటి వద్దే ఇస్తున్నాం. సాంకేతిక ఇబ్బందులున్న చోట ఆఫ్‌లైన్‌లో పంపిణీ చేస్తున్నాం. వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పింఛన్లు మాత్రమే మిగులుతున్నాయి. రెండు నెలలు రాకపోయినా మూడో నెలలో వస్తే పింఛన్ మొత్తం అందజేస్తాం.
– వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ
రెండు కిలోమీటర్లు నడవాలి
నేను యాడికిలోని రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నా. పింఛన్‌ను కోన రోడ్డులోని చౌడేశ్వరి గుడి వద్ద ఇస్తారు. అక్కడికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతదూరం వెళ్లి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది.
– చిన్న నారాయణ, యాడికి
Advertisement
Advertisement