కీసర(మేడ్చల్ జిల్లా): ఆసరా పింఛన్ల పంపిణీ ప్రహాసనంగా మారింది. పింఛన్ల సోమ్ము తీసుకునేందుకు వృద్ధులకు ఆగచాట్లు తప్పడం లేదు. సర్వర్లు మొరాయించడంతో వేలిముద్రలు తీసుకోవడం ఆలస్యం అవుతుండటంతో వృద్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో పింఛను పంపిణీ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులుతీరుతున్నారు. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ప్రతినెలా ఇదే తంతు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. రోజంతా పింఛన్ కేంద్రం వద్ద ఉన్నా పింఛన్ డబ్బులు తీసుకుంటామన్న నమ్మకం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
తిప్పలు తప్పాలంటే నేరుగా ఖాతాలోకి వేయాలి
రెండు, మూడు రోజులుగా పింఛన్ల కోసం తిరుగుతున్నా సర్వర్ సమస్యతో డబ్బులు తీసుకోలేకపోతున్నానని ఎస్వీనగర్‌కు చెందిన మోహన్‌రావు వాపోయారు. మరికొందరు ఉదయం 7 గంటలకు టిఫిన్ తీసుకొని వచ్చి పింఛన్ల డబ్బుల కోసం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ తిప్పలు తప్పాలంటే తమకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చూడాలని ఉన్నతాధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు. జిహెచ్‌ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఫించన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారని మున్సిపాలిటీల్లోనూ ఇది అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment