
అటవీశాఖ కొర్రీలు..!
నుంచి కాచరాజుపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి అవాంతరాలు
–మట్టి రోడ్డును బీటీగా మార్చొద్దంటున్న ఫారెస్ట్ అధికారులు
–తలలు పట్టుకుంటున్న అధికారులు, కాంట్రాక్టర్లు
దేవరకొండ / చందంపేట :
కాచరాజుపల్లి పుష్కర ఘాట్‌కు మొదటి నుంచి అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. డిండి – దేవరకొండ ప్రధాన రోడ్డు నుంచి కాచరాజుపల్లి వరకు సుమారు 31 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాచరాజుపల్లి ఘాట్‌కు వెళ్లాలంటే బుగ్గతండా నుంచి 1.8 కిలో మీటర్ల దూరం అటవీ ప్రాంతంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న శాఖ కావడంతో మొదటి నుంచి అనుమతులకు అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. పుష్కరాల కోసం 1.8 కిలో మీటర్ మేర రోడ్డు మంజూరు కాగా కోటి రూపాయల వ్యయంతో బుగ్గతండా నుంచి కాచరాజుపల్లి వరకు రహదారి వేయాల్సి ఉంది. అయితే కొన్ని రోజులుగా ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ విషయంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. జిల్లా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికీ ఒకటి రెండుసార్లు కాంట్రాక్టర్లను హెచ్చరించడంతో పాటు కేసు కూడా నమోదు చేశారు.
తాజాగా ..
తాజాగా ఈనెల 25న బుగ్గతండా నుంచి కాచరాజుపల్లి ఘాట్ వరకు 1.8 కిలోమీటర్ల దూరం రోడ్డు వేయడానికి అనుమతిస్తూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుంచి ఆర్‌అండ్‌బీ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అందులోనూ రోడ్డుకు కొర్రీలు తప్పలేదు. వాస్తవంగా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పుష్కర ప్రాంతాలకు వెళ్లే అన్ని రోడ్లను డబుల్‌గా మారుస్తున్నారు. అందులో కాచరాజుపల్లి రోడ్డును కొద్ది దూరం( 5 మీటర్లు) కూడా బీటీగా మార్చే అవకాశం లేదని ఫారెస్ట్ శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఏరియా నుంచి మట్టి తీయరాదంటూ నిబంధన విధించింది. దీంతో ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులుతల పట్టుకుంటున్నారు.
రహదారి సాగేదెలా ?
పుష్కరాలకు చిన్న వాహనాలతో పాటు భారీ వెహికిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ, ఫారెస్ట్ శాఖ పెడుతున్న కొర్రీల వల్ల ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే పుష్కర భక్తులకు ప్రయాసగానే మారనుంది. అధికారులు మాత్రం కాచరాజుపల్లి పుష్కర ఘాట్ నిర్మాణానికి లక్షలో వెచ్చిస్తున్నారు. అంతే కాకుండా బుగ్గతండా నుంచి కాచరాజుపల్లి ఘాట్‌కు వెళ్లాలంటే 70 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టను ఎక్కి దిగాల్సి ఉంటుంది. దీనిపై ప్రయాణమంటే ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి. కాచరాజుపల్లి మార్గాన్ని తప్పని పరిస్థితుల్లో కొంచెం పెంచినా మట్టి రోడ్డును మాత్రం బీటీ చేసే అవకాశం లేదు. ఇక రెండు కిలోమీటర్ల నుంచి మట్టి తీసుకురావాలంటే కాంట్రాక్టర్‌కు కూడా అదనపు ఖర్చే అవుతుంది. ఈ నేపథ్యంలో రోడ్డు వైశాల్యం పెంచుతారా ? కాంట్రాక్టర్ రెండు కిలోమీటర్ల నుంచి మట్టి తీసుకొచ్చి అనుకున్న సమయానికి రోడ్డు పని పూర్తి చేయగలుగుతాడా ? ఫారెస్ట్ శాఖ దీనిపై తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా అనేది ఇప్పటికీ ప్రశార్థకంగా మారింది.