అడవుల రక్షణపై అవగాహన | Forest protection awareness | Sakshi
Sakshi News home page

అడవుల రక్షణపై అవగాహన

Published Sat, Nov 26 2016 3:07 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

అడవుల రక్షణపై అవగాహన - Sakshi

అడవుల రక్షణపై అవగాహన

అడవుల రక్షణపై అవగాహన
కడెంలో ఎఫ్‌ఎస్‌వోల బృందం

కడెం : శిక్షణ అంటేనే మనకు తెలియని కొత్త విషయాలు, కొత్త అంశాలపై అవగాహన చేసుకోవడం. అయితే ఈ శిక్షణ కోసం హైదరాబాదు, దూలపల్లికి చెందిన తెలంగాణ ఫారెస్టు అకాడమీ నుంచి 48 మంది ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు(ఎఫ్‌ఎస్‌ఓలు) శుక్రవారం నిర్మల్ జిల్లాలోని కడెంకు వచ్చారు. కడెం అటవీ క్షేత్ర పరిధిలోని గంగాపూర్, పాండ్వాపూర్ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో శిక్షణ బృందం డిప్యూటీ డెరైక్టర్ కొండల్‌రావు, కడెం ఎఫ్‌ఆర్వో రాథోడ్ రమేష్‌లు  వివిధ అంశాలపై బృందం సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రాజెక్టు చివరన ఉన్న మైసమ్మ గుట్ట ద్వారా అడవుల్లోకి  ప్రవేశించి గంగాపూర్ అటవీ సెక్షన్‌లోకి వెళ్లారు. అక్కడ చెక్‌డ్యాంలు, నీటికుంటలు, కందకాలు, వాచ్‌టవర్, సాసర్‌పిట్స్, మొక్కల శాస్త్రీయ నామం,వాటి ఎదుగుదల గురించి అధికారులు వివరించారు. టైగర్ జోన్‌లో జంతువుల సంరక్షణ, వాటి కదలికలపై వివరిస్తున్నారు.

శాఖ పరంగా అవగాహన కలిగి ఉన్న గంగాపూర్ ఎఫ్‌ఎస్‌వో నజీర్‌ఖాన్ శిక్షణ బృందానికి పలు అంశాలపై సమగ్రంగా బోధించారు. కడెం ఎఫ్‌ఆర్వో రాథోడ్ రమేష్, ఎఫ్‌బీలు ఏ ప్రభాకర్, శ్రీనివాస్, కీర్తి రెడ్డిలు ఈ శిక్షణ బృందం వెంట ఉన్నారు. బృందంలో 38 మంది పురుషులు కాగా 10 మంది మహిళలున్నారు. అక్టోబరు 5న ప్రారంభమైన శిక్షణ డిశంబర్ 8న పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఇప్పటివరకు  మెదక్  డివిజన్‌లోని  సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, నిర్మల్, కుంటాల, పొచ్చెర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. ఈ నెల 26న జన్నారం, 27న మంచిర్యాల, 28న భూపాలపల్లి, 29న భద్రాద్రి, 30న చింతూరు(ఏపీ), డిశంబర్1న పాడేరు, 2న అరకు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు అధికారులు వివరించారు. త మ శిక్షణ గురించి కడెంలో ‘సాక్షి’ తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు.
 
ధైర్యంగా ఉంటోంది
నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఉద్యోగం అన్నాక శ్రమ ఉంటుంది. కానీ ఏనాడు నేను మహిళను.. ఈ ఉద్యోగం ఎలా చేయాలి.. అని ఆలోచించలేదు. అడవిలో పెట్రోలింగ్ చెయ్యాలి. బాధ్యత అన్నాక తప్పదు. ధైర్యం అంటే యూనిఫాంలోనే ఉంటుందనేది నా విశ్వాసం. అదే రక్షణ ఇస్తోంది . సి. సుప్రియ, ఎఫ్‌ఎస్‌వో, హైదరాబాద్

రోజూ కొత్త పాఠంలాగా..
శిక్షణలో చాలా విషయాలు తెలుస్తున్నాయి, అటవీ చట్టం, సెక్షన్లు ఇంకా అనేక విషయాలపై అవగాహన వస్తోంది. రోజూ కొత్త పాఠం నేర్చుకున్నట్లుగా ఉంది. మా ప్రాంతంలో అడవి ఉంది కానీ ఈ ప్రాంతంలో మరీ దట్టమైన అడవులున్నాయి. అధికారులు శిక్షణలో అన్నీ బాగా వివరిస్తున్నారు. - సీహెచ్ స్వర్ణలత, ఎఫ్‌ఎస్‌వో, పాల్వంచ

ఎన్నో మెళ కువలు తెలుస్తున్నాయి
నాకు శాఖాపరంగా, అటవీ చట్టం తదితర అంశాలపై మొదట కొంత అవగాహన ఉన్నప్పటికీ ఇపుడు శిక్షణలో మరిన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి, శిక్షణ ద్వారా కొత్త అనుభవాలు, మొక్కలపై అవగాహన చాలా పెరుగుతుంది. మా అనుమానాలను కూడా అధికార్లను అడిగి నివృత్తి చేస్కుంటున్నాం.  - ఏ రవీందర్ ఎఫ్‌ఎస్‌వో, కడెం
 
పకడ్బందీగా శిక్షణ
ఈ బృందాన్ని ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వివిధ అంశాలపై అవగాహన కల్పించాం. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని టైగర్‌జోన్‌లో వివిధ ప్రాంతాలకు వెళ్లాం. టైగర్ సెన్సెస్, ఇక్కడి డీర్స్ పార్కు, దట్టమైన అడవులు, బేస్ క్యాంపులు, తదితర ప్రాంతాలపై అవగాహన కల్పిస్తాం. శిక్షణ పూర్తిగా పకడ్బందీగా నిర్వహిస్తాం. శిక్షణ వచ్చే నెలలో ముగుస్తుంది. - కొండల్‌రావ్, శిక్షణ బృందండిప్యూటీ డెరైక్టర్, దూలపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement