రోదిస్తున్న తల్లి విమలమ్మ, బంధువులు
ప్రాణం తీసిన అప్పులు
Published Mon, Jul 18 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
– చెన్నారంలో యువరైతు ఆత్మహత్య
– కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
గోపాల్‌పేట : మండలంలోని చెన్నారానికి చెందిన విమలమ్మ, పూరుమాల జగత్‌రెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరికి సమీపంలో ఐదెకరాల పొలం ఉంది. గతంలోనే తండ్రి చనిపోయాడు. పెద్దకొడుకు స్వగ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా, చిన్నకొడుకు హైదరాబాదులో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మరోకొడుకు జైపాల్‌రెడ్డి(28) వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఖరీఫ్ సీజన్‌లో తమకున్న పొలంతోపాటు నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న వేశాడు. రెండెకరాల్లో వరిసాగు చేసేందుకు తుకం పోశాడు. ఉన్న ఒక్క బోరులో నీళ్లు తగ్గిపోవడంతో అప్పులు చేసి ఇటీవల అదనంగా మూడు బోర్లు వేయించినా ప్రయోజనం దక్కలేదు. గత వేసవిలో వ్యవసాయం కోసం ఎద్దులు కొనుగోలు చేయగా, రెండేళ్లక్రితం కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఇలా అన్నింటికి సుమారు రూ.నాలుగు లక్షలు అప్పులయ్యాయి. రెండేళ్లుగా వర్షాలులేక వేసిన పంటలు ఎండిపోయి పెట్టుబడులు రాక చేసిన అప్పులు తీర్చే దారిలేక మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేనపుడు తాడుతో ఉరేసుకుని చనిపోయాడు. మధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి చేరుకున్న తల్లి విమలమ్మ విషయం తెలుసుకుని బోరుమంది. ఈ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ట్రైనీ ఎస్‌ఐ రాము సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Advertisement