పత్తి వద్దే వద్దు!
♦ ఈ ఏడాది ధర భారీగా పతనమయ్యే అవకాశాలు
♦ పత్తి ఎగుమతులకు రాయితీలు తగ్గించాలన్న డబ్ల్యూటీఓ
♦ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటున్న అధికారులు
♦ అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్న వ్యవసాయశాఖ
♦ ఖరీఫ్‌లో పత్తినే నమ్ముకుంటున్న 70 శాతం మంది రైతులు
చేవెళ్ల: పత్తి సాగుచేస్తే నష్టాలపాలవుతారని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ పంట సాగుపై రైతులు అయోమయంలో పడ్డారు. పత్తి ఎగుమతులకు రాయితీలు తగ్గించాలన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తీర్మానాన్ని భారత ప్రభుత్వం ఆమోదించడంతో ఈ ఏడాదినుంచి పత్తి ధరపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఈ పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తుండడంతో రైతులు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మూడు నాలుగు దశాబ్ధాలుగా చేవెళ్ల ప్రాంతంలో పత్తినే ఖరీఫ్‌లో వర్షాధార పంటగా దాదాపు 60 నుంచి 70 శాతం మంది సాగుచేస్తున్నారు. కొన్నేళ్లుగా పత్తిని సాగుచేసి లాభాలు ఆర్జిస్తున్న రైతులకు కేంద్రం నిర్ణయంతో కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై పత్తికి బదులుగా ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, జొన్న, కంది, మినుము, పెసర, సోయా, చిక్కుడు తదితర పంటలను వేసుకోవాలని సూచిస్తున్నది. ‘మన తెలంగాణ-మన వ్యవసాయం‘ కార్యక్రమంలో అధికారులు రైతులకు ప్రధానంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
చేవెళ్ల ప్రాంతంలోనే అధికంగా సాగు..
చేవెళ్ల వ్యవసాయ డివిజన్‌లోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండలాలలో మూడు నాలుగు దశాబ్ధాలుగా ఖరీఫ్ సీజన్‌లో పత్తిని సాగుచేస్తున్నారు. ఒకేసారి పంట రావడం, డబ్బులు కూడా ఒకేసారి వస్తుండడంతో ఈ పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతియేటా పత్తి సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా సాగవుతున్నది. చేవెళ్ల వ్యవసాయ డివిజన్‌లో 2013 ఖరీఫ్ సీజన్‌లో చేవెళ్ల మండలంలో 1,802 హెక్టార్లలో పత్తి సాగుకాగా, 2014లో 1922 హెక్టార్లు, 2015లో 1975 హెక్టార్లలో పత్తి సాగుచేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. షాబాద్ మండలంలో 2013లో 5406 హెక్టార్లలో పత్తిని సాగుచేయగా, 2014లో 5530 హెక్టార్లు, 2015లో 5315 హెక్టార్లలో సాగుచేశారు. శంకర్‌పల్లి మండలంలో 2013లో 1906 హెక్టార్లలో సాగుచేయగా, 2014లో 1970 హెక్టార్లు, 2015లో 2024 హెక్టార్లలో సాగుచేశారు. మొయినాబాద్ మండలంలో 2013లో 360 హెక్టార్లు, 2014లో 380 హెక్టార్లు, 2015లో 395 హెక్టార్లలో పత్తిపంటను సాగుచేశారు.
ఇప్పటికే సన్నద్ధమవుతున్న రైతులు..
పత్తి పంటను సాగుచేయడానికి ఇప్పటికే రైతులు సన్నద్ధమవుతున్నారు. వేసవిలో దుక్కులు దున్ని వర్షాలు పడగానే పత్తి విత్తనాలు నాటడానికి సమయాత్తమవుతున్నారు. గత సంవత్సరం వర్షాభావంతో దిగుబడులు గణనీయంగా తగ్గినా పత్తిపై రైతులకు మోజుమాత్రం తీరలేదు. ఫర్టిలైజర్ షాపుల యజమానులు విత్తనాలకోసం ఇప్పటికే పలు కంపెనీలకు అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించినట్లు సమాచారం. రైతులు కూడా బీటీ పత్తి విత్తనాలను అడ్వాన్స్‌గా బుక్‌చేసుకున్నట్లు తెలుస్తుంది. జూన్‌నుంచి మొదలయ్యే ఖరీఫ్‌లో సాగుచేసిన పత్తి మార్కెట్‌కు వచ్చే సమయానికి డబ్ల్యుటీఓ నిబంధన అమలులోకి వస్తుంది. దీంతో అప్పటికే ఎగుమతులకు డిమాండ్ లేకపోవడమే కాకుండా, దేశీయంగా కనీస మద్ధతు ధర దక్కే అవకాశం ఉండదని తెలంగాణ వ్యవసాయ శాఖ భావిస్తోంది. దీంతో అధికారులు అవగాహన సదస్సులను వేదికగా చేసుకొని రైతులను ఆహార పంటలవైపు మళ్లించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సాగు విస్తీర్ణాన్ని తగ్గించేందుకు రైతులకు అవగాహన
పత్తి విస్తీర్ణాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని, రైతులు నష్టపోకుండా వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో రైతు సదస్సులలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. పత్తి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు, సబ్సిడీల తగ్గింపు, గులాబీ పురుగులు పంటకు నష్టం చేయడం, తదితర కారణాలవల్ల పత్తి పండిస్తే రైతులు నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. - దేవ్‌కుమార్, ఏడీఏ, చేవెళ్ల