తెలంగాణకే తలమానికం | Foundation stall to be installed for international driving school in siricilla | Sakshi
Sakshi News home page

తెలంగాణకే తలమానికం

Published Tue, May 17 2016 11:25 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

Foundation stall to be installed for international driving school in siricilla

- అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‌కు నేడు మండెపల్లి వద్ద శంకుస్థాపన
- హాజరవుతున్న మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి

 
సిరిసిల్లలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.25 కోట్ల వ్యయంతో నెలకొల్పుతున్న డ్రైవింగ్ స్కూల్‌కు రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్, పరిశోధన కేంద్రానికి అనుమతులు మంజూరు చేయగా... మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చొరవతో రాష్ట్ర సర్కారు పనులను వేగవంతం చేస్తోంది.   
 -సిరిసిల్ల
 
 సిరిసిల్ల : సిరిసిల్ల మండలం మండెపల్లి శివారులో 25 ఎకరాల స్థలాన్ని అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ కోసం రెవెన్యూ అధికారులు గతేడాది కేటాయించారు. స్థలానికి సంబంధించిన ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్‌ను హద్దులతో సహా రెవెన్యూ అధికారులు ఇటీవలే అందించారు. ఇందులో డ్రైవింగ్ ట్రాక్, టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్ శిక్షణ పొందేవారికి హాస్టల్ వసతి, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలకు రూ.25 కోట్లను ప్రభుత్వం కేటారుుంచింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా పది నెలల కిందట స్థలాన్ని పరిశీలించి వెళ్లారు.
 
 దక్షిణ భారతదేశంలో రెండోది..
 దక్షిణ భారతదేశంలో మొదటి అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ తమిళనాడు రాష్ట్రం లో ఉండగా, రెండోది సిరిసిల్లలో నెలకొల్పుతుండటం విశేషం. ప్రముఖ వాహనాల తయూరీ సంస్థ అశోక్ లేలాండ్ సహకారంతో డ్రైవింగ్ స్కూల్, పరిశోధన కేంద్రా న్ని ఏర్పాటు చేస్తుండటం తెలంగాణకే తలమానికంగా నిలువనుంది. డ్రైవింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలపై పరిశోధనలు చేసే అవకాశం ఉంది. ప్రపంచంలోనే బెస్ట్ డ్రైవింగ్ విధానాలను అధ్యయనం చేయడంతోపాటు ఇక్కడ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వ డం జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే సిరిసిల్ల ఎంవీఐ శ్రీనివాస్‌తోపాటు రాష్ట్రం లోని పలువురు ఎంవీఐలు ఏడాది కిందట మలేషియాలో జరిగిన అంతర్జాతీయ డ్రైవింగ్ సదస్సుకు వెళ్లి వచ్చారు.
 
 యువతకు ఉపాధి అవకాశాలు..
 సిరిసిల్లలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుతో జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇక్కడ డ్రైవింగ్‌లో మెరుగైన శిక్షణ అందిస్తారు. ఆర్టీసీ డ్రైవర్లతోపాటు హెవీ వెహికిల్స్ నడిపేవారికి నైపుణ్యమైన  శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థల్లో పని చేసే డ్రైవర్లకు సిరిసిల్లలోనే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే యువకులకు సైతం అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుంది. ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు సైతం మరింత శిక్షణ కోసం పనిష్మెంట్‌లో భాగంగా డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
 
 నేడు ముగ్గురు మంత్రుల పర్యటన
 సిరిసిల్ల రూరల్ : రాష్ట్ర పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, రవాణాశాఖ మంత్రి మ హేందర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవా రం సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిరిసిల్ల మండలం మండెపల్లి వద్ద రూ.25 కోట్ల తో నెలకొల్పుతున్న అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, పరిశోధన కేంద్రం, ఐటీఐ కళాశాల భవనం, రగుడు వద్ద రూ.30 కోట్లతో సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డు నిర్మాణాలకు వారు భూమిపూజ చేయనున్నారు. అనంతరం మండెపల్లి శివారులోని మోడల్ స్కూల్ సమీపంలో పదివేల మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నారు.
 
 ఈ మేరకు ఏర్పాట్లను సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, ఎంపీపీ దడిగెల కమలభాయి, జెడ్పీటీసీ పూర్మాణి మంజుల, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ సుమలత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు వొజ్జల అగ్గిరాములు, పార్టీ జిల్లా నాయకులు దడిగెల శ్రావణ్‌రావ్, పూర్మాణి లింగారెడ్డి, మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్ పర్యవేక్షించారు. బహిరంగసభకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే సిరిసిల్ల మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త తరలించేందుకు 250 సైకిళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముగ్గురు మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement