విశాఖలో ‘సమీర్’కు కేంద్రమంత్రి శంకుస్థాపన
► ఏర్పాటుకానున్న ఎలక్ట్రానిక్ రీసెర్చ్, ఇంక్యుబేషన్ కేంద్రాలు
విశాఖపట్నం: సాగర నగరిలో మరో ప్రతిష్ఠాత్మక కేంద్రం ఏర్పాటు కానుంది. విశాఖలో కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో రూ.80.02 కోట్లతో గంభీరం ఐటీ సెజ్‌లో ఏర్పాటు కానున్న సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్) సెంటర్‌కు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఎలక్ట్రానిక్ రీసెర్చ్ సెంటర్, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ‘సమీర్’ విశాఖలో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇంటర్‌ఫిరెన్స్ అండ్ కంపాటిబిలిటీ విభాగంలో పరిశోధనలు చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలకు అవసర మైన ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్‌కు ఇది వేదిక కానుంది. దీనివల్ల రక్షణ రంగంతో పాటు అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్, పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో పరిశోధనల స్థాయి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సంబంధిత ఇంటర్‌ఫిరెన్స్, కంపాటిబిలిటీ, పల్స్ తదితర సౌకర్యాలను ఈ కేంద్రం కల్పిస్తుంది. దీని ద్వారా తూర్పు తీరం లో ఐటీ ఉత్పత్తుల విక్రయ, వినియోగదారులకు ల బ్ధి చేకూరనుంది. ఆర్మీ, నేవల్ సైన్స్ అండ్ టెక్నాల జీ ల్యాబ్, డీఆర్‌డీవో తదితర సంస్థల అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
రూ.45 కోట్లతో ఇంక్యుబేషన్ కేంద్రం
కాగా విశాఖలో ఐటీకి ఊతమిచ్చే ఇంక్యుబేషన్ సెంటర్ ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చుతోంది. ఈ కేంద్ర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని వుడా కేటాయించగా, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కు ఆఫ్ ఇండియా నిర్మాణం చేపట్టబోతోంది. సిరిపురం జంక్షన్‌లో ఉన్న వుడా స్థలంలో ఈ కేంద్రాన్ని రూ.45 కోట్లతో నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర కమ్యూనిషన్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ల సమక్షంలో గురువారం దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు. ఈ రెండు కేంద్రాల ఏర్పాటుతో సుమారు 25వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.