గురువా.. ఇవేమి లీలలు? | fraud in teachers transfers issue | Sakshi
Sakshi News home page

గురువా.. ఇవేమి లీలలు?

Published Wed, Jul 26 2017 11:12 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

గురువా.. ఇవేమి లీలలు? - Sakshi

గురువా.. ఇవేమి లీలలు?

- కొందరు అనారోగ్యమంటూ అడ్డదారులు
- పక్కా ఖాళీలు చూపడంలో మాయజేశారు
- అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం
- మంత్రాంగం నడుపుతున్న డీఈఓ కార్యాలయ సిబ్బంది
- అన్యాయమవుతున్న సామాన్య ఉపాధ్యాయులు


ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయ బదిలీలు పారదర్శరమన్నారు.. అడ్డదారులు తొక్కేవారికి అవన్నీ తుత్తునీయలే అని తేలిపోయింది. అన్ని వసతులూ ఉన్న స్కూల్‌ అయితే ఓకే..కొందరు అదనపు పాయింట్లు వేయించుకునేందుకు కక్కుర్తిపడితే..ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యమంటూ మరికొందరు లేని రోగాలు తెచ్చుకుంటే..ఇంకొందరు బోగస్‌ ధ్రువపత్రాలు జత చేస్తే.. అధికారులేమో పక్కా ఖాళీలు చూపడంలో మాయ చేశారు. ఇలా..అడుగడుగునా అడ్డదారులే.. తెరవెనుక డీఈఓ కార్యాలయ సిబ్బంది మంత్రాంగం నడిపారు. ఫలితంగా కొందరి స్వార్థానికి సామాన్య ఉపాధ్యాయులు అన్యాయమయ్యారు. ఇదీ ఉపాధ్యాయుల బదిలీల తీరు.  
- అనంతపురం ఎడ్యుకేషన్‌
 
ఒకసారి బదిలీ అయితే 8 సంవత్సరాలు అక్కడే పనిచేయొచ్చు. ఇంతకాలం ఒకేచోట పనిచేయాలంటే అన్ని వసతులు ఉన్న పాఠశాల అయితే సమస్య ఉండదు. ఇందుకోసం అర్హత లేకపోయినా అడ్డదారులు తొక్కుతున్నారు. అనర్హులైనా ప్రిపరెన్షియల్‌ కేటగిరి. అవకాశం లేకపోయినా దొంగదారిలో పాయింట్లు వేయించుకుంటున్నారు.  పారదర్శకత అంటూ చేపట్టిన ఉపాధ్యాయుల ఆన్‌లైన్‌ బదిలీల్లో అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వీరి అక్రమాలకు కొందరు డీఈఓ కార్యాలయ సిబ్బంది అండగా నిలుస్తున్నారు. ఫలితంగా సామాన్య టీచర్లకు తీరని అన్యాయం జరుగుతోంది.

ఆన్‌లైన్‌ బదిలీల్లో అంతా అయోమయమే :
    పాయింట్లు నమోదంతా ఆన్‌లైన్‌లో జరుగుతుండడం, కౌన్సెలింగ్‌ హాలులోకి బదిలీ టీచర్లు తప్ప ఎవర్నీ అనుమతించకపోవడంతో ఏం జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి. చివరకు క్లియర్‌ వేకెన్సీలు కూడా చూపించడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత, సీసీఈ పాయింట్లు రెండింటిలో ఏవైనా ఒకటే వేసుకోవాలి. కానీ కొందరు టీచర్లు ఎంచక్కా రెండు రకాల పాయింట్లు వేసుకొని తమకు అనుకూలమైన స్కూళ్లకు వెళ్లిపోయారు. అలాగే తొలి ప్రాధాన్యత ఉన్న ప్రిపరెన్షియల్‌ కేటగిరీ జాబితాలో ఉండేందుకు కొందరు టీచర్లు లేనిరోగాలు తెచ్చుకున్నారు.

తమ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నారంటూ బోగస్‌ ధ్రువీకరణపత్రాలు జత చేశారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ స్కూల్‌లో ఇద్దరు టీచర్లు తమ పిల్లలకు అనారోగ్యమంటూ పాయింట్లు వేసుకున్నారు. వీరిలో ఓ టీచరు కుమారుడు ప్రస్తుతం గుడివాడలో పేరుమోసిన కార్పొరేట్‌ స్కూల్‌లో చదువుతుండడం విశేషం. ఇలా మంచి స్థానాలకు వెళ్లేందుకు అయ్యవార్లు అడ్డదారులు తొక్కుతున్నారు.  క్లియర్‌ వేకెన్సీలు చూపడంలోనూ మాయ చేస్తున్నారు. ఒకే స్థానంలో 8 ఏళ్లు సర్వీస్‌ పూర్తయిన టీచర్లు తప్పనిసరి బదిలీ. వారిస్థానాలు కౌన్సెలింగ్‌లో కచ్చితంగా చూపించాలి. వీటిని చూపడంలోనూ మతలబు చేయడం విస్మయం కలిగిస్తోంది.

– అమడగూరు మండలం తుమ్మల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌. మహేశ్వర్‌రెడ్డి గణితం టీచరుగా పని చేçస్తున్నాడు. ఈయన 8 ఏళ్లు సర్వీస్‌ పూర్తి కావడంతో తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్నాడు. ఈయన స్పౌజ్‌ ఇదే మండలంలో పని చేస్తున్నారు. స్పౌజ్‌ కేటగిరి కింద దరఖాస్తు చేసుకున్నారు. సీనియార్టీ జాబితాలో 647 సీరియల్‌ నంబర్‌లో మహేశ్వర్‌రెడ్డి పేరుంది. కౌన్సెలింగ్‌లో అదే మండలం పూలకుంటపల్లి ఆప్ట్‌ చేశారు. వాస్తవానికి పూలకుంటపల్లి పాఠశాలలో క్లియర్‌ వేకెన్సీ ఉంది. అయినా కౌన్సెలింగ్‌ సిబ్బంది మహేశ్వర్‌రెడ్డిని దబాయించారు. అక్కడ వేకెన్సీ లేదంటే ఉందని వాదిస్తున్నావంటే ఆయనపైనే దండెత్తారు. దీంతో పది నిమిషాలపాటు కౌన్సెలింగ్‌ ఆగిపోయింది. గందరగోళం సృష్టించడంతో ఏం చేయాలో దిక్కు తెలీని ఆయన చివరకు చాలా ఇబ్బందికరమైన నంబులపూలకుంట మండలం ఈఎన్‌ పల్లి పాఠశాలకు ఆప్ట్‌ చేశాడు. మహేశ్వర్‌రెడ్డి తర్వాత 657 సీరియల్‌ నంబర్‌లో వచ్చిన మరో టీచరుకు పూలకుంటపల్లి పాఠశాల ఆప్ట్‌ చేయించడం వెనుక ఆంతర్యమేమిటో విద్యాశాఖ అధికారులకే తెలియాలి.

– పెద్దపప్పూరు మండలం మండలం గార్లదిన్నె జిల్లా పరిషత్‌ పాఠశాలలోకి అదే మండలం పసలూరు ప్రాథమికోన్నత పాఠశాల విలీనం అయింది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో అవసరమైతే గార్లదిన్నె స్కూల్‌లకు అదనంగా పోస్టు మంజూరు కావాలి. కాని క్లియర్‌ వేకెన్సీగా ఉన్న బయలాజికల్‌ సైన్స్‌ పోస్టుకు పసులూరు యూపీ స్కూల్‌లో బీఎస్‌ టీచరుగా పని చేస్తున్న రఘురామయ్యను సర్దుబాటు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. రేషనలైజేషన్‌ ప్రభావితమయ్యే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. వారికి అదనంగా పాయింట్లు కూడా కేటాయించారు. కానీ ఇక్కడ రఘురామయ్య కనీసం దరఖాస్తు  కూడా చేసుకోలేదు.దీని వెనుక డీఈఓ కార్యాలయ ఉద్యోగి మంత్రాంగం నడిపారు. ఈ వ్యవహారంపై ఆర్జేడీ, కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా కొన్ని అక్రమాలు టీచర్లు మొదలుకొని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది, ఆర్జేడీ వరకు అందరికీ తెలిసినా తేలుకుట్టిన దొంగల్లా ఉండడం విశేషం. దీనివెనుక రాజకీయ ఒత్తిళ్లు, డబ్బులు చేతులు మారడమే అసలు రహస్యం అని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement