జనం సొమ్ముతో జల్సా | Fraud In Anantapur Postal Department | Sakshi
Sakshi News home page

జనం సొమ్ముతో జల్సా

Published Sat, Nov 10 2018 12:02 PM | Last Updated on Sat, Nov 10 2018 12:02 PM

Fraud In Anantapur Postal Department - Sakshi

అనంతపురం టౌన్‌: పోస్టాఫీసుల్లో అక్రమాలకు కొదవే లేకుండా పోతోంది. దొరికితే దొంగ...లేదంటే దొరే! అన్న చందంగా తపాలా అధికారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. రోజుకో చోట అక్రమాలు వెలుగుచూస్తున్నా.. కోట్లాది రూపాయాల జనం సొమ్ము స్వాహా అయినట్లు విచారణలో వెల్లడైనా.. తపాలా శాఖ సిబ్బందిపై ఎలాంటి చర్యలు లేవు. ఆ  కేసుల్లో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు.  

వెలుగు చూసిన 75 వీరాపురం బీపీఎం అక్రమం
అనంతపురం తపాలా డివిజన్‌ వ్యాప్తంగా 58 సబ్‌ పోస్టాఫీసులు, 410 బ్రాంచ్‌ పోస్టాపీసులున్నాయి. తపాలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది అక్రమాలకు తెరలేపారు. ప్రజలడిపాజిట్లను ఖాతాల్లో జమ చేయకుండా సొంతానికి వినియోగించుకుంటూ కోట్లాది రూపాయాలను కొల్లగొట్టినా...ఎలాంటి చర్యలు లేకపోవడంతో దర్జాగా తిరుగుతున్నారు. తాజాగా రాయదుర్గం మండలం 75వీరాపురం బ్రాంచ్‌ పోస్టాఫీసులో బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ (బీపీఎం) పోస్టాఫీసులో దాచుకుంటున్న ప్రజల సొమ్మును సొంతానికి వాడేసుకున్నాడు. కొన్నేళ్లుగా ఈ తంతు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టల్‌ ఖాతాదారుల పుస్తకాల్లో డబ్బులు కట్టినట్లు నమోదు చేసి పోస్టల్‌ ఖాతాదారులను నిలువునా ముంచినట్లు తెలుస్తోంది.

బయటపడిందిలా..
75–వీరాపురం గ్రామానికి చెందిన ఇద్దరు పోస్టల్‌ ఖాతాదారులు తపాలా శాఖ కొంత మొత్తాన్ని పొదపు చేశారు. గడువు ముగిసిన తర్వాత వారు బాండ్లను తీసుకొని డబ్బుల కోసం రాయదుర్గం సబ్‌ పోస్టాఫీసుకు వెళ్లారు. అయితే తమ పేరిట ఎలాంటి డిపాజిట్‌ లేదని సమాధానం ఇవ్వడంతో నాలుగు రోజుల క్రితం ఖాతాదారులు బీపీఎంను నిలదీశారు. 75–వీరాపురంలో పోస్టల్‌ ఖాతారులు చెల్లించిన సొమ్మును అక్కడి బీపీఎం సబ్‌పోస్టాఫీసులో జమ చేయకుండా కొన్ని సంవత్సరాలుగా సొంతానికి వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.లక్షల్లో ప్రజల సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం 75–వీరాపురం బ్రాంచ్‌ పరిధిలోని ఖాతాదారులు తమ ఖాతాల్లోని నిల్వలను సరి చూసుకునే పనిలో నిమగ్నమైనారు. 

గ్రామీణుల నిరక్ష్య రాస్యతను ఆసరాగా చేసుకుని
ఇప్పుడంటే బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి గానీ...ఒకప్పుడు గ్రామీణులంతా చిన్న మొత్తాలను తపాలాలోనే పొదుపు చేసుకునే వారు. పైగా ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు ఉండడంతో బ్రాంచ్‌పోస్ట్‌ మాస్టర్లు వారి సొమ్మును స్వాహా చేయడం ప్రారంభించారు. వారి డబ్బు కట్టినట్లు పాస్‌బుక్కుల్లో రాసినప్పటికీ, ఆసొమ్ము ఖాతాల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకునే వారు. ఎక్కడైనా బయటపడితే అప్పటికప్పుడు వారికివ్వాల్సిన మొత్తం ఇచ్చేసి వివాదాన్ని సద్దుమణిపించే వారు. ఇలా కొన్నేళ్ల తర్వాత స్వాహాల పర్వం రూ.లక్షలు దాటేయడంతో వారి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది.

తపాలా శాఖలో అక్రమాలు మచ్చుకు కొన్ని
గార్లదిన్నె, నూతిమడుగు ఎస్‌ఓ (సబ్‌ఆఫీసుల్లో) పరిధిలోని రెండు చోట్ల సబ్‌ పోస్టు మాస్టర్‌ శ్రీనివాసులు అనే అధికారి విధులు నిర్వహిస్తున్నారు. రెండు చోట్ల దాదాపు రూ.3 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నిగ్గులేల్చారు. వీటిపై సీబీఐ అధికారులు సైతం విచారణ జరిపారు. రెండేళ్లు కావస్తున్నా... కేసులో ఎలాంటి పురోగతి లేదు.  
ముద్దినేయనిపల్లి బ్రాంచ్‌ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఉమేష్‌ అనే బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ ఉపాధి కూలీలకు అందాల్సిన నిధులను కాజేశాడు. వీటిని సైతం అధికారులు గుర్తించలేకపోయారు. ఉపాధి బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో కూలీలు పోస్టాఫీసు ముందు ధర్నా నిర్వహించడంతో విచారణ చేపట్టిన అధికారులు రూ.50 లక్షలు కాజేసినట్లు తేల్చారు. ఇక్కడ సైతం చర్యలు లేవు.  
కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్దె బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ కేశవనాయక్‌ ఏకంగా బాలికా సంరక్షణ పథకం డిపాజిట్లకు ఎసరు పెట్టాడు. డిపాజిట్లను ప్రజల నుంచి కట్టించుకుంటున్నాడు తప్పితే... ప్రధాన తపాలా కార్యాలయంలో మాత్రం లబ్ధిదారుల పేరిట నగదును మాత్రం జమ చేయలేదు. దీంతో బాండ్లు ఇవ్వాలని లబ్ధిదారులు 8 నెలల క్రితం బ్రాంచ్‌ పోస్టాఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడంతో ఈ అక్రమం సైతం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.3 లక్షలకు పైగా సొంతానికి వినియోగించుకున్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు.  

అక్రమార్కులపై చర్యలు నిల్‌
పోస్టాఫీసుల్లో కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులపై చర్యలు లేకపోవడంతో పోస్టల్‌ అధికారులు బరితెగిస్తున్నారే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన అక్రమాలపై  సైతం నేటికి విచారణే జరుగుతుండడంతో ప్రజల సొమ్మును దోచుకున్న పోస్టల్‌ అధికారులు దర్జాగా తిరుగుతున్నారు. అక్రమార్కుల నుంచి  రికవరీ చేయడంపై సైతం ఉన్నతాధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో అక్రమార్కులు దొరికితే దొంగ.. లేదంటే దొర అన్న చందంగా ప్రజల డబ్బులను సొంతానికి వినియోగించుకుంటున్నారు. కొందరు అధికారులైతే  ప్రజల సొమ్మును అవసరాలను తీర్చుకున్న తర్వాత మూడు నెలలకు ఒకసారి జమ చేస్తున్నారనే ఆరోపణలు తపాలాశాఖ అధికారుల నుంచే వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement