విచారణ చేస్తున్న అధికారులు
రైల్వేకోడూరు అర్బన్: అవగాహన లేని అమాయకులను పోస్టాఫీసులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు మోసం చేస్తున్నారు. పాస్‌బుక్‌లో రాసి పోస్టల్ అకౌంట్‌లో జమ చేయకుండా బురిడీకొట్టించి రూ.30లక్షలకుపైనే దోచుకున్నట్లు తెలిసింది. రైల్వేకోడూరు మండలంలోని ఉర్లగడ్డపోడు పంచాయతీ ఎస్‌వీనగర్ ఫోస్టాఫీస్‌లో పనిచేస్తున్న బీపీఎం జ్యోతి, సహాయకుడిగా ఉన్న ఆమె భర్త సుబ్రమణ్యంలు కుట్రపూరితంగా స్థానికులైన నారాయణ, లక్ష్మీదేవి, అరుణ, వెంకటలక్ష్మి, సుగుణ, శంకరయ్య, శంకరమ్మ, చీర్ల సుబ్బలతోపాటు సుమారు 100కి పైగా అకౌంటల్లో భద్రపరుచుకున్న సొమ్ము రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు గోల్‌మాల్ చేశారు.
తాము దాచుకున్న సొమ్ము దోపిడీకి గురికావడంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. విచారణకు వచ్చిన పోస్టల్‌శాఖ అధికారులు నరసింహులు, శివయ్య తూతూమంత్రంగా విచారణ చేసి బాధ్యులైన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ అధికారులను, జ్యోతి, సహాయకుడిగా ఉన్న అమె భర్త సుబ్రమణ్యంలను ప్రజలు చుట్టుముట్టి నిలదీశారు. పోస్టాఫీసులో ఈ దోపిడీ వ్యవహారంపై కొందరు పైఅధికారులకు ఫిర్యాదుచేయడంతో వారంరోజుల క్రితం వచ్చిన అధికారులు విచారణను గోప్యంగా జరిపారు. 1వ తేదీ వరకు ఆగమని ప్రజలకు చెప్పి వెళ్లారు. కాగా గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చిన అధికారులు పోస్టాఫీసులో స్థానిక సర్పంచ్ శ్రీధర్, బాధితుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. బీపీఎం జ్యోతి, ఆమె భర్త సుబ్రమణ్యంలను కూడా విచారించారు. సమగ్ర నివేదిక పైఅధికారులకు పంపుతామని చెప్పి కొన్ని అకౌంట్లలో మాత్రమే తప్పుదోవ పట్టించారని చివర్లో వెళుతూ తెలపడంతో బాధితులు ఆందోళనకు దిగారు.
విచారణ చేసి నిగ్గుతేలుస్తాం
కాగా ఉర్లగడ్డపోడు పంచాయతీ ఎస్వీనగర్ పోస్టాఫీస్‌లో జరిగి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గుతేలుస్తామని విచారణకు వచ్చిన పోస్టల్ శాఖ అధికారులు నరసింహులు, శివయ్యలు పేర్కొన్నారు. ఇక్కడి పాస్‌బుక్‌లు, రికార్డులు అన్ని స్వాధీనం చేసుకుని జరిగిన విషయాలను కడప పోస్టల్ శాఖ పైఅధికారులకు నివేదిస్తామన్నారు. పూర్తిస్తాయిలో విచారించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
మాడబ్బులు వచ్చేటట్లు చేయండి
రోజువారీ కూలీలకు వెళ్లి సంపాదించిన సొమ్ములో రూ.18000 దాచుకున్నా. భవిష్యత్ అవసరాలకు స్థానికంగా ఉండే పోస్టాఫీసులలో నమ్మమకంతో భద్రపరుచుకున్నా. కానీ ఇప్పుడు కేవలం రూ.3000 ఉందని చెబుతున్నారు. నా డబ్బులు వచ్చేటట్లు చేయండి. –వెంకట సుబ్బమ్మ, గజ్జలవారిపల్లి, కోడూరు
Comments
Please login to add a commentAdd a comment