ప్రేమ పేరుతో మోసం! | fraud of love in seva sadanam | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసం!

Published Sun, Aug 20 2017 4:03 AM | Last Updated on Mon, Jul 29 2019 6:54 PM

ప్రేమ పేరుతో మోసం! - Sakshi

ప్రేమ పేరుతో మోసం!

– ఆడ శిశువుకు జన్మనిచ్చిన బాలిక
– ‘ఆశ్రయం’ విషయంలో తలెత్తిన వివాదం
– జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ దృష్టికి ఘటన
– తాత్కాలికంగా సేవాసదనంలో వసతి  

 
అనంతపురం టౌన్‌: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ మైనర్‌ బాలిక చివరకు గర్భం దాల్చింది. ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. నమ్మిన వాడు జాడ లేకుండాపోగా..కన్న తండ్రి చేరదీసేందుకు వెనకంజవేశాడు. చివరకు అనాథలా ‘ఆశ్రయం’ కోసం అష్టకష్టాలు పడుతోంది. ఎక్కడ తన నుంచి బిడ్డను వేరు చేస్తారోనని భయపడుతోంది. వివరాల్లోకి వెళితే... బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి బాలిక కొన్నేళ్ల క్రితమే తల్లిని కోల్పోయింది. కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో అదే మండలానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. సదరు యువకుడు బాలికను గర్భవతిని చేసి పత్తా లేకుండాపోయాడు. ఈ విషయం తెలిసిన తండ్రి ఇంటి నుంచి గెంటేశాడు.

దీంతో కొన్నాళ్ల నుంచి అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ‘ఉజ్వల’ హోంలో ఆశ్రయం పొందుతోంది. ఈనెల 14న సర్వజనాస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శనివారం ఈ విషయం తెలియడంతో చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు తల్లీబిడ్డను తడకలేరు సమీపంలోని జువైనల్‌ హోంలో సీడబ్ల్యూసీ (చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ) ముందు ప్రవేశపెట్టారు. ఇద్దరికి మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ సమీపంలో ఉన్న సేవాసదనంలో ఆశ్రయం ఇవ్వాల్సిందిగా కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు ఇద్దరినీ తీసుకుని అక్కడికి వెళ్లగా అడ్మిషన్‌ చేయించుకునేందుకు సేవాసదనం అధికారిణి వనజాక్షి అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇక్కడ ఆశ్రయం ఇస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సేవాసదనంలోని విద్యార్థులకు నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ తరగతులను ప్రారంభించేందుకు జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ అక్కడకు చేరుకున్నారు. చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో వనజాక్షితో మాట్లాడారు.

నిబంధనలను అడిగి తెలుసుకుని అప్పటికే వర్షం కురుస్తుండటంతో తాత్కాలిక షెల్టర్‌ ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా 18 ఏళ్లలోపు వారికి ఆశ్రయం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా 37 ఫిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఉన్నాయి. సీడబ్ల్యూసీ అధికారులు వీటిలో ఆశ్రయం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వకుండా సేవాసదనంకు పంపడం విమర్శలకు తావిచ్చింది. కాగా సేవాసదనంకు వచ్చిన సమయంలో శిశుగృహ అధికారులు సదరు బాలిక వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తన నుంచి బిడ్డను ఎక్కడ వేరు చేస్తారోనని బాలిక భయపడినట్లు సమాచారం. ఏది ఏమైనా ఓ యువకుడి నయవంచనకు బాలిక జీవితం కకావికలమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement