చేతివృత్తుల్లో శిక్షణ తరగతులు ప్రారంభం
ఆరిలోవ: రెండో వార్డులో జీవీఎంసీ పట్టణ పేదరికి నిర్మూలన సంస్థ(మెప్మా), జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్(ఎన్‌యూఎల్‌ఎం) సంయుక్తంగా చేతి వృత్తుల్లో ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటుచేశాయి. ఈ శిక్షణ తరగతులను శనివారం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు ప్రారంభించారు. ఇక్కడ 80 మంది మహిళలకు టైలరింగ్, మరో 80 మంది మహిళలకు బ్యుటీషియన్‌లోను శిక్షణ ఇవ్వనున్నారు. వారికి సరిపడా మిషన్లు, బ్యుటీషియన్ సామాన్లు అందుబాటులో ఉంచారు. వారికి శిక్షణ ఇవ్వడానికి ఇన్‌స్ట్రక్టర్లను ఏర్పాటుచేశారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే వెలగపూడి ఈ సందర్భంగా సూచించారు. ఇలాంటి శిక్షణ వల్ల మహిళలు వారి కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవడానికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు మూడు నెలల పాటు జరుగుతాయన్నారు. రోజుకు ఆరు గంటలు పాటు శిక్షణ ఇస్తారన్నారు. బ్యుటీషియన్‌లో రెండు నెలలు, టైలరింగ్‌లో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఒమ్మి సన్యాసిరావు, స్థానిక నాయకులు గాడి సత్యం, మోది అప్పారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.