సోమశిల పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాల్లో వివిధ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వరుసగా 6వరోజు భక్తులు పోటేత్తారు. పుష్కరఘాట్లకు ఉదయం 5 గంటలకే భక్తుల తాకిడి మొదలైంది. సెలవు దినాలు కాకపోయినప్పటికీ పుష్కరాలు మరికొన్ని రోజులే ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివస్తున్నారు. గురువారం అత్యధికంగా రంగాపూర్ పుష్కరఘాట్‌లో దాదాపు 2.80లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానమాచరించారు. ఈ ఘాట్‌కు అనూహ్యంగా భక్తుల తాకిడి పెరిగింది. సోమశిల, బీచుపల్లి, గొందిమళ్ల, క్యాతూర్, పస్పుల, నది అగ్రహారం, కష్ణ, పంచదేవులపాడు, పాతాళగంగ వంటి ఘాట్లు సైతం పుష్కర భక్తులతో కళకళలాడాయి. జూరాల పుష్కరఘాట్‌లో నీళ్లు పూర్తిస్థాయిలో అడుగంటడంతో వరుసగా రెండో రోజు మూసివేశారు. జూరాల ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు తగ్గడంతో దిగువ ప్రాంతానికి నీటి విడుదలను అధికారులు నియంత్రించారు. దీంతో అనేక పుష్కరఘాట్లలో నీటి మట్టం గురువారం మరింత తగ్గింది. గొందిమళ్ల, సోమశిల, పాతాళగంగ పుష్కరఘాట్లకు శ్రీశైలం వరద జలాలు వస్తుండడంతో ఆ ఘాట్లు మాత్రం జలకళ సంతరించుకున్నాయి.
గొందిమళ్ల ఘాట్ పరిశీలన
గొందిమళ్లలోని పుష్కరఘాట్ల ఏర్పాటును హైదరాబాద్ జోన్ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ రెమారాజేశ్వరి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు తదితరులు పరిశీలించారు. బుధవారం కడా బీచుపల్లి, రంగాపూర్, సోమశిల ఘాట్లలో ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించారు.
వీఐపీలు ఇలా..
రంగాపూర్ పుష్కరఘాట్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 102 సంవత్సరాల వయసు గల నిరంజన్‌రెడ్డి తల్లి సైతం పుష్కరస్నానం ఆచరించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో పుణ్యస్నానమాచరించారు. సాయంత్రం కృష్ణమ్మ తల్లికి నది హారతి ఇచ్చారు. అలంపూర్ కలెక్టర్ టీకే శ్రీదేవి నదీమా తల్లికి హారతి ఇచ్చారు. నది అగ్రహారం పుష్కరఘాట్‌లో సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్, రైల్వే జనరల్ మేనేజర్ జ్ఞానేశ్వర్, గద్వాల వెంకట్‌రాంరెడ్డి తదితరులు పుణ్యస్నానాలు ఆచరించారు. గొందిమళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ హరినాథరావు కుటుంబసభ్యులతో వచ్చి పుణ్యస్నానం ఆచరించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పాతాళగంగలో పుణ్యస్నానమాచరించారు. సోమశిల పుష్కరఘాట్‌లో ఎమ్మెల్సీ ప్రభాకర్ పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. నాంపల్లి ఫ్యామిలి కోర్టు జడ్జి లక్ష్మి కామేశ్వరి, రంగారెడ్డి జిల్లా జడ్జి సుజన తదితరులు సోమశిలలోని వీఐపీ ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైఎస్‌కు పిండప్రదానం
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి కొల్లాపూర్ మండలం మంచాలకట్ట పుష్కరఘాట్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి వాజిద్ తదితరులు పాల్గొన్నారు.