లోకేశ్ సీఎం కావొచ్చు!
కాకినాడలో విలేకరులపై యనమల అసహనం
కాకినాడ సిటీ: ‘సీఎం పదవికేముంది లోకేశ్ కావచ్చు.. బొడ్డు వెంకట రమణ (స్థానిక విలేకరి) కావచ్చు’ అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసహనం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు తర్వాత లోకేశ్ సీఎం అవుతారా? ఇంతవరకు పార్టీలో నెంబర్ 2గా ఉన్న మీ పరిస్థితి ఏంటి?’ అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి కాస్త ఇబ్బందిగానే స్పందించారు. లోకేశ్ మంత్రి కావడం, ముఖ్యమంత్రి కావడం అనేది అప్రస్తుత, అప్రాధాన్య అంశమని వ్యాఖ్యానించారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో యనమల గురువారం మీడియాతో మాట్లాడారు. లోకేశ్ ను మంత్రి చేయాలని పార్టీలో చర్చ జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో విలేకరుల ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. ‘అధినేతను పార్టీ అడగాలి కదా?’ అన్నారు. మరి మీరు పార్టీలో కీలకమైన స్థానంలోనే ఉన్నారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా, ఉపయోగపడే ప్రశ్నలు వేయాలంటూ అసహనం వ్యక్తం చేశారు. పోలవరం జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. 2018 నాటికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోయినా కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేస్తామని చెప్పారు.