గంగ ఒడికి గణనాథుడు | ganesh nimmajjanam | Sakshi
Sakshi News home page

గంగ ఒడికి గణనాథుడు

Published Tue, Sep 13 2016 6:47 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

గంగ ఒడికి గణనాథుడు - Sakshi

గంగ ఒడికి గణనాథుడు

– అత్యంత వైభవోపేతంగా నిమజ్జనోత్సవం
– ఉదయం 10 గంటల నుంచి నిమజ్జనానికి తరలిన వినాయకులు
– వీధివీధిలో మిన్నంటిన సంబరాలు
– వేషధారణలు, భాజాభజంత్రీలు
– వెల్లివిరిసిన మతసామరస్యం


కర్నూలు(కల్చరల్‌): నింగి నిండా నిర్మలమైన వాతావరణం... చెమ్మ నింపుకున్న మేఘాల సమావేశం... అప్పుడప్పుడూ కురుస్తూ చినుకుల చప్పుడు చేస్తూ మేఘుడు నింగి నుంచి ఆశీస్సుల జల్లులు కురిపిస్తున్న వేళ గణనాథుడు గంగమ్మ ఒడికి తరలివెళ్లాడు. గత తొమ్మిది రోజులుగా ఘనమైన పూజలందుకున్న ఏకదంతుడు భాజాభజంత్రీల మధ్య, చప్పట్లు, తాళాల నడుమ... భక్తజనుల సంబరాల నడుమ నిమజ్జనానికి కదలివెళ్లాడు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కర్నూలు నగరంలో గణేష్‌ నిమజ్జనోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. స్థానిక రాంభొట్ల దేవాలయం నుంచి నిమజ్జనోత్సవ ఊరేగింపు ప్రారంభమయ్యింది. రాంభొట్ల ఆలయం నుంచి కుమ్మరి వీధి, చిత్తారి గేరి, వన్‌టౌన్‌ కూడలి, గడియారం ఆసుపత్రి కూడలి, పెద్దమార్కెట్‌ కూడలి, అంబేద్కర్‌ కూడలి దాటి గణేష్‌ విగ్రహాలు కొండారెడ్డిబురుజు కూడలిని చేరుకున్నాయి. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి ప్రారంభమైన రెండో ఊరేగింపు ఆనందోత్సాహాల నడుమ... కొత్తబస్టాండ్, బంగారుపేట, మౌర్యా ఇన్‌ సర్కిల్‌ మీదుగా రాజ్‌విహార్‌ సెంటర్‌ను చేరుకుంది. కల్లూరు చౌరస్తా నుంచి ప్రారంభమైన మూడో ఊరేగింపు కష్ణానగర్‌ హైవే కూడలి, బిర్లాగేటు, విజ్ఞాన మందిరం, టీటీడీ కళ్యాణ మండపం మీదుగా మద్దూర్‌నగర్, గాయత్రి ఎస్టేట్స్‌ మీదుగా వినాయక ఘాట్‌ను చేరుకున్నది. నగరంలోని నలుమూలల నుంచి తరలివచ్చిన గణేశ్‌ విగ్రహాలు మధ్యాహ్నం 2 గంటలకు వినాయక ఘాట్‌ను చేరుకున్నాయి. వెంకటరమణ కాలనీ, సంతోష్‌నగర్, జొహరాపురం, బి.తాండ్రపాడు, నంద్యాల చెక్‌పోస్టు తదితర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాలు సాయంత్రం వినాయక ఘాట్‌ను చేరుకున్నాయి.


మధ్యాహ్నం 2:30 గంటలకు నిమజ్జనోత్సవం ప్రారంభం
నగరంలోని వినాయక ఘాట్‌ వద్ద కేసీ కెనాల్‌లో ఏర్పాటు చేసిన తెప్పపై విద్యార్థులు నత్యాలు ప్రదర్శించారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్‌ జ్యోతి ప్రజ్వలన చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాకలెక్టర్‌ సి.హెచ్‌.విజయమోహన్‌ వినాయక ఘాట్‌ వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత భరతమాతకు పూజలు చేశారు.

పరిపాలనా గణపతికి డిప్యుటీ సీఎం నిమజ్జనం
గత తొమ్మిది రోజులుగా కలెక్టరేట్‌లో పూజలందుకున్న పరిపాలనా గణపతిని వినాయక ఘాట్‌ వద్ద తొలి నిమజ్జనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఇ.కష్ణమూర్తి పూజలు చేసిన అనంతరం పరిపాలన గణపతిని నిమజ్జనం చేశారు. తెప్పపై ఉంచిన రాంభొట్ల ఆలయ గణపతికి డిప్యుటీ సీఎం కె.ఇ.కష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ సి.హెచ్‌.విజయమోహన్, ఎస్పీ ఆకే రవికష్ణ, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పూజలు నిర్వహించి  నిమజ్జనం చేశారు. అనంతరం నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన విగ్రహాలను వరుసగా వినాయక ఘాట్‌లోని క్రేన్‌ల ద్వారా నిమజ్జనం చేశారు.

సామరస్యానికి ప్రతీక గణేశ్‌ ఉత్సవాలు...
కర్నూలులో గణేశ్‌ ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ప్రాంత సంపర్క్‌ ప్రముఖ్‌ ఓలేటి సత్యనారాయణ తెలిపారు. స్థానిక వినాయక ఘాట్‌ వద్ద జరిగిన నిమజ్జనోత్సవంలో ఆయన సందేశాన్ని అందిస్తూ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథుడు బాలగంగాధర్‌ తిలక్‌ స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపేందుకు గణేష్‌ ఉత్సవాలను ప్రారంభించారన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు భారతీయులు గణేశ్‌ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో భారతీయ సంస్కతికి ప్రతీకగా జరుపుకుంటున్నారన్నారు. కర్నూలు నగరం ముపై ్ప ఏళ్లకు పైగా గణేష్‌ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌కే ఆదర్శంగా నిలిచిందన్నారు.

వెల్లివిరిసిన మతసామరస్యం
నగరంలో బక్రీద్‌ పండుగ, గణేశ్‌ నిమజ్జనం ఒకే రోజున కలసిరావడంతో ముస్లింలు, గణేష్‌ భక్తమండలి సభ్యులు కలసిమెలసి రెండు పండుగలను అత్యంత ఆనందోత్సాహల నడుమ జరుపుకున్నారు. నగరంలో వన్‌టౌన్, పూలబజార్, బండిమెట్ట, గడ్డా వీధి, కుమ్మరి వీధి, మేదారి వీధి, బుధవారపేట, కొత్తపేట, ఎన్‌ఆర్‌ పేట, అబ్బాస్‌నగర్, అమీన్‌ అబ్బాస్‌నగర్, ఖడక్‌పుర తదితర ప్రాంతాల్లో గణేష్‌ నిమజ్జనోత్సవంలో పలువురు హిందువులు, ముస్లింలు పాల్గొని ప్రసాదాలు పంపిణీ చేసుకున్న దశ్యం అందరినీ ఆకట్టుకుంది. నగర వీధుల్లో గణేష్‌ విగ్రహాలను తరలిస్తున్న వేళ భాజాభజంత్రీలు, విచిత్ర వేషధారణలతో గణేష్‌ భక్తులు చూపరులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అన్ని మతాల, కులాల యువకులు పాల్గొనడం విశేషం.

బహుమతి ప్రదానం
గణేష్‌ ఉత్సవాల సందర్భంగా బుధవారపేటలోని కేశవ మెమోరియల్‌ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వ పోటీలలో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు డిప్యుటీ సీఎం కె.ఇ.కష్ణమూర్తి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌రెడ్డి బహుమతులు అందజేశారు. గణేశ్‌ నిమజ్జనోత్సవం సందర్భంగా కేసీ కెనాల్‌లో ఏర్పాటు చేసిన తెప్పపై నత్యజ్యోతి సంస్థ కళాకారులు ప్రదర్శించిన తెలుగు తేజం నత్యం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం అన్నపూర్ణ వసతి గహం విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్ల విన్యాసం శ్రీగణనాథం నత్యప్రదర్శన, పలుకే బంగారం, తారంగం, గణేష కీర్తన తదితర నత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గణేష్‌ నిమజ్జనోత్సవ కమిటీ నిమజ్జనోత్సవంలో పాల్గొన్న అతిథులందరికీ జ్ఞాపికలు అందజేసింది.  కార్యక్రమంలో గణేష్‌ మహోత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు కపిలేశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు కిష్టన్న, మాకం నాగరాజు, కాళింగి నరసింహవర్మ, సందడి సుధాకర్, సందడి మహేష్, ప్రాణేష్, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement