బాలికపై గ్యాంగ్‌రేప్
- కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్లు
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
- నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఖమ్మం క్రైం : ఓ బాలికను కిడ్నాప్ చేసి.. ఆపై గ్యాంగ్‌రేప్ చేసిన సంఘటన ఖమ్మం నగరంలోని త్రీటౌన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్రీటౌన్ ఎస్సై మల్లయ్య కథనం ప్రకారం.. నగరంలోని పీఎస్‌ఆర్ రోడ్‌కు చెందిన బాలిక(15) జూన్ 20వ తేదీన ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చింది. తాను ప్రేమించిన చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ రోశయ్య వద్దకు తీసుకెళ్లాలని.. అతడి స్నేహితుడు, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ సోందుపాషా వద్దకు వచ్చి అడగ్గా.. ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. అదే ఆటోలో పాషా సోదరుడు షేక్ దాదా కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఆటోను కాల్వొడ్డు వైపు తిప్పుతుండగా.. అనుమానం వచ్చిన బాలిక పాషాను ప్రశ్నించింది. అరిస్తే చంపుతానని బెదిరించి.. ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి తెల్దారుపల్లి సాగర్ కాల్వ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత రూరల్ మండలం గొల్లగూడెం ప్రాంతానికి చెందిన మరో ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. అతడు కూడా అక్కడికి చేరుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆమెను ఖమ్మం బస్టాండ్‌లో దింపి వెళ్లిపోయారు. బస్టాండ్‌లో ఉన్న బాలిక తాను ప్రేమించిన రోశయ్యకు ఫోన్ చేయగా.. అతడు అక్కడికి చేరుకుని ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అయితే భయంతో గ్యాంగ్‌రేప్ విషయం రోశయ్యకు చెప్పలేదు. పెళ్లి చేసుకున్న రోశయ్య బాలికను తన స్వగ్రామం కోమట్లగూడెంకు ఉంచాడు. కాగా.. షాపులో పని చేసేందుకు వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. అదృశ్యమైన బాలిక చింతకాని మండలం కోమట్లగూడెంలో ఉన్నదని ఈనెల 10వ తేదీన పోలీసులకు తెలియడంతో.. వారు వచ్చి విచారించగా విషయం బయటపడింది. దీంతో డీఎస్పీ సురేష్‌కుమార్ అధ్వర్యంలో సీఐ మొగిలి, ఎస్సై మల్లయ్య రంగంలోకి దిగి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే బాలికను పెళ్లి చేసుకున్న రోశయ్యపై పోలీసులు అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు చేసి.. అతడిని కూడా అరెస్ట్ చేశారు.