'నీట్' తీర్పు తర్వాతే ఎంసెట్ ఫలితాలు: గంటా
విశాఖపట్నం: 'నీట్'పై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయం చేసిన తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. 'నీట్'పై తీర్పు కాపీని వెబ్ సైట్ లో పెడతామని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఎంసెట్ ఫలితాల విడుదలపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు మంత్రి వెల్లడించారు. ముందు ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల చేసి తర్వాత మెడికల్ రిజల్ట్ ఇవ్వాలని భావించామని చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర్పు ఇంకా రాకపోవడంతో ఫలితాల విడుదల ఆలస్యమైందని వివరించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, ఈ రోజు రాత్రికి ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నేడు వీలుకాకుంటే రేపు ఉదయం ఫలితాలు విడుదల చేస్తామన్నారు. 'నీట్'పై స్పష్టత రాకుండా హడావుడిగా ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలనుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.