నిర్లక్ష్యమా? సాంకేతిక లోపమా?
నిర్లక్ష్యమా? సాంకేతిక లోపమా?
Published Wed, Mar 1 2017 11:28 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
తూర్పుపాలెంలో త్రుటిలో తప్పిన బ్లో అవుట్
తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా కానరాని జాగ్రత్త
మలికిపురం (రాజోలు) :
సమయం : బుధవారం ఉదయం 11 గంటలు
స్థలం : తూర్పుపాలెం గ్రామం, కే డబ్ల్యూ 17 జడ్ ఓఎన్‌జీసీ సైట్ ..
ఉన్నట్టుండి డ్రిల్లింగ్ జరిగిన బావి నుంచి అకస్మాత్తుగా భారీ గ్యాస్, ఆయిల్ పెల్లుబికింది. గ్యాస్ కిలో మీటరు మేర ఆవరించింది. సిబ్బంది, ఇంజినీర్లు కూడా తొలుత పరుగులు పెట్టారు.సమీపంలోని జీసీఎస్ ( గ్యాస్ గేదరింగ్ స్టేషన్)ల నుంచి సుమారు 200 మంది సిబ్బంది, నాలుగు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. అరగంట గడిచాక గ్యాస్ తొలగింది. కాసేపు తేరుకున్న సిబ్బంది, కంటికి సంఘటన స్థలం కనిపిస్తుండడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో సంఘటన బావి వద్దకు చేరుకున్నారు. ఒక ఓఎన్‌జీసీ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఇక్కడ అత్యంత భయంకర వాతావరణం నెలకొంది. ఆయిల్, గ్యాస్ ఆవరించి ఉంది. ఇక్కడే మరో మూడు గ్యాస్ ఆయిల్, బావులు ఉన్నాయి. ఫొటోలు తీస్తే ఆ ఫ్లాష్ తీవ్రతకు ఫైర్ అయితే పెను ప్రమాదం సంభవిస్తుందని స్థానిక విలేకరులను, గ్రామస్తులను హెచ్చరించారు. ప్రమాద తీవ్రత ఏంటో చెప్పకనే అర్థమవుతోంది. దీనికి కారణం ఎవరు. ఇక్కడ జీవిస్తున్న ప్రజలదా? భద్రత లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయిల్ సంస్థలదా? ఇలాంటి అనేక సంఘటనలు ప్రాణాలను హరించి వేస్తున్నాయి.
1990 ప్రాంతంలో కొమరాడ ఆయిల్ బావి బ్లో అవుట్ నుంచి 1994 అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లోఅవుట్,
1995లో కొత్త పేట మండలం దేవర పల్లి బ్లోఅవుట్, 2014లో నగరం పైప్ లైన్ పేలుడు, సహా అనేక సంఘటనలు ఆయిల్ నిక్షేపాల అన్వేషణలో జరిగాయి. మూడే ళ్ల క్రితం రాజోలు మండంలో కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. దగ్గర్లో నివాసాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రెండేళ్ల క్రితం రాజోలు మండలంలో కాట్రేని పాడు బావి బ్లోఅవుట్ కొద్దిపాటిలో తప్పింది. కేజీ బేసిన్‌లోఉమారు 11 వందల బావులు, మొత్తం 900 కిలో మీటర్లు గ్యాస్ పైప్‌లైన్లు విస్తరించి ఉన్నాయి. బావులు కోనసీమలోనే అధికం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకూ పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం బావులను, గెయిల్ పైప్‌లైన్‌లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కానీ కేజీ బేసిన్‌లో ఈ బావుల, పైప్‌లైన్‌ల నిర్వహణ సక్రమంగాలేదు.
అంతా నిర్లక్ష్యం ..
బావులు, గ్యాస్ పైప్‌లను తరచూ ఒత్తిడి, రాపిడికి గురై పాడయి పోతున్నా వాటిని మార్చాల్సిన గెయిల్‌తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నా ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నాయి తప్ప, మరమ్మతులకు పెట్టుబడి పెట్టడం లేదు.
నాణ్యత లోపం ..
ఆయిల్ బావుల పర్యవేక్షణ, పైప్‌లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వీటి నిర్వహణ, నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్‌లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
దోపిడీయే తప్ప అభివృద్ధి శూన్యం
ఆయిల్ నిక్షేపాలను తరలించుకు పోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రేవేటు సంస్థలకు గ్యాసును కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాల వల్ల దెబ్బతింటున్న రోడ్లను కూడా ప్రభుత్వమే నిర్మించాల్సి వస్తోంది.
కుంగిన కోనసీమ
ఓఎన్‌జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సమద్రం నుంచి ఉప్పు నీరు భూబాగం పైకి వస్తుందని ఆ బృందం స్పష్టం చేసింది.
Advertisement
Advertisement