మలుపు తిప్పిన గీతాంజలి....
- ఫొటోగ్రాఫర్ నుంచి సినీ దర్శకుడిగా...
- సత్తాచాటుతున్న రాజ్‌కిరణ్
కైకలూరు : కృషి పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యమైన పనినైన సుసాధ్యం చేయవచ్చని నిరూపిస్తున్నాడు ఓ యువ దర్శకుడు. భుజంపై కెమేరాను వేలాడదీసుకుని పొట్టకూటి కోసం పరుగులెత్తిన ఆ ఫోటోగ్రాఫర్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డెరైక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. గతమెంతో గాయాలైన తన లక్ష్యాన్ని అందిపుచ్చుకున్నాడు. మరోపది మందికి ఉపాధి చూపిస్తున్నాడు. అతనే కైకలూరుకు చెందిన ఫొటోగ్రాఫర్ రాజ్‌కిరణ్. ఆయన తెరకెక్కిం చిన హర్రర్, థ్రిల్లర్ మూవీ త్రిపుర నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
కైకలూరులో కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగిన రాజ్‌కిరణ్ అసలు పేరు పిల్లి బాలాజీ. తండ్రి సాధారణ ఇంజన్ మెకానిక్. రాజ్‌కు ఓ తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. తండ్రి ఆదరణ కరువైంది. దీంతో కుటుంబ భారం రాజ్‌కిరణ్‌పై పడటంతో ఫోటోగ్రాఫర్‌గా జీవితాన్ని ఆరంభిం చాడు. ఈ పని చేస్తూనే బాలాజీ మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేసి తమ్ముడితో కలసి కచేరీలు చేశా డు.
తనప్రతిభకు సరైన గుర్తింపు లేదని కుటుంబం తో కలసి హైదరాబాదు వెళ్లి సినీరంగంలో అడుగిడాడు. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ వద్దన్నా అక్కడే ఉండి వీఆర్.ప్రతాప్, రాజా వన్నంరెడ్డి, రవిరాజా పినిశెట్టి వంటి దర్శకుల వద్ద మెళుకువలు నేర్చుకున్నాడు.
మలుపు తిప్పిన గీతాంజలి....
అంజలీ కథానాయకిగా గత ఏడాది విడుదలైన గీతాంజలి సినిమా రాజ్‌కిరణ్‌లో ప్రతిభకు అద్దంపట్టింది. ఆ సినిమాకు కథా రచయిత, దర్శకత్వ బాధ్యతలను సమర్థవంతంగా రాజ్‌కిరణ్ పోషిం చారు. సినిమా ఆద్యంతం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఆ తరువాత కలర్స్ స్వాతితో కథానాయికగా అందాల రక్షాసి ప్రేం నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో త్రిపుర పేరుతో సినిమాను తెరకెక్కించాడు. దాదాపు 600 సినిమా థియేటర్లలో ఈ సినిమా రిలేజ్ కానుంది. రాజ్‌కిరణ్ దర్శకునిగా గుర్తింపు పొందడం తమకు ఎంతో గర్వంగా ఉందని కైకలూరులోని ఆయన స్నేహితులు చెబుతున్నారు.
అవకాశాలను అందిపుచ్చుకోవాలి!
జీవితంలో మనం కోరుకున్నది సాధించాలంటే కష్టపడాలి. ఆ దారిలో ముళ్లు కంపలు ఉన్నాయని వెను తిరగకూడదు. ప్రస్తుత జీవనయానంలో సినిమా ట్రెండ్ మారింది. ప్రేక్షకుడు సినిమా నచ్చకపోతే టిక్కెట్టు ఎంత పెట్టికొన్నాం.. అని ఆలోచించడం లేదు. థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోతున్నాడు. వంద రూపాయిలతో సినిమాకు వస్తున్న ప్రేక్షకుడిని అలా నిరాశపర్చకూడదు. అందుకే మంచి కథను ఎంచుకుంటున్నాను. క్రేజీ మీడియాపై తెరకెక్కించిన త్రిపుర సినిమా అందరిని ఆకట్టుకుంటుంది.
- రాజ్‌కిరణ్, త్రిపుర చిత్ర దర్శకుడు