బీజేపీని దూరం పెట్టండి
కేసీఆర్‌కు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సలహా
సాక్షి, సంగారెడ్డి: లౌకికవాద పార్టీ అయిన టీఆర్‌ఎస్.. మతతత్వ బీజేపీతో జతకట్టడం తెలంగాణ ప్రజలకు మంచిదికాదని, అందువల్ల దానిని దూరం పెట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. తెలంగాణకు కీడు చేసే అలాంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవద్దని సూచించారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సీపీఎం చేపట్టిన కరువు యాత్రను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు.
బీజేపీ నేతలకు రాష్ట్రంలో పదవులు ఇచ్చి, కేంద్రంలో తమ నేతలకు పదవులు దక్కేలా కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఈ ఊహాగానాలకు తెరదించేలా టీఆర్‌ఎస్ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. బంగారు తెలంగాణ, మైనార్టీల రిజ ర్వేషన్లకు కట్టుబడి ఉన్న టీఆర్‌ఎస్.. బీజేపీతో దూరంగా ఉండాలని రాఘవులు సూచించారు. కరువు నివారణలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని రాఘవులు ఆరోపించారు. కరువును నివారించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు రావన్నారు. కరువుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలని సూచించారు.