ఇక స్పష్టంగా ఇంటి నెంబర్లు | ghmc will plan to give new house numbers | Sakshi
Sakshi News home page

ఇక స్పష్టంగా ఇంటి నెంబర్లు

Published Fri, Jul 29 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

ఇక స్పష్టంగా ఇంటి నెంబర్లు

ఇక స్పష్టంగా ఇంటి నెంబర్లు

►   డిజిటల్‌ సిస్టమ్‌కు శ్రీకారం
►   లొకాలిటీ తెలిసేలా జాగ్రత్తలు
►   అక్షరాలు, అంకెలు కలిసి మొత్తం 8 డిజిట్లు
►   కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ లేనివారి కోసం టోల్‌ఫ్రీ

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ నగరంలో ఇళ్ల నెంబర్లను కనుక్కోవడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో ఇప్పటికే పలు కథలు..విమర్శలు ప్రచారంలో ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటి నెంబర్ల గజిబిజికి స్వస్తి చెప్పేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. ఇప్పటికే రెండుమూడు రకాల ప్రణాళికలు రూపొందించి, కొంతమేర పనులు కూడా చేశారు. ఒక దశలో లొకాలిటీ, వీధి నెంబరు, ఇంటినెంబర్లతోనే సులభంగా కనుక్కునేలా చర్యలు చేపట్టారు.

అందులో భాగంగా రెండు సర్కిళ్లలో ఇంటినెంబర్ల ప్లేట్లు కూడా  బిగించారు. అనంతరం, మారుతున్న ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా జిప్పర్‌ కోడ్‌ను అమలు చేయాలని భావించారు. గగన్‌మహల్‌లో ప్రయోగాత్మకంగా దానిని  ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా అటు డిజిటల్‌గా ఉండేలా, ఇటు డిజిటల్‌ వినియోగం తెలియని వారికి సైతం తెలిసేలా ఉభయతారకంగా కొత్త విధానాన్ని అమలు చేయాలని భావించారు. ఈ కొత్త విధానం ద్వారా ఆన్‌లైన్‌ సదుపాయం కలిగిన వారు ఏ చిరునామాను కనుక్కోవాలన్నా తాము ఎక్కడ ఉన్నది తెలియజేస్తే చాలు ఎక్కడి నుంచి

ఎటు వెళ్లాలి.. రమారమి ఎంత దూరం ఉంటుంది.. ఎంత సమయంలో చేరుకోవచ్చు వంటి వివరాలను గూగుల్‌మ్యాప్స్‌ తరహాలో ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు. దీంతోపాటు జీఐఎస్‌  నేవిగేషన్‌ కూడా ఉంటుంది. కంప్యూటర్‌లో కానీ, స్మార్ట్‌ఫోన్‌లో కానీ సంబంధిత చిరునామాను ఎంటర్‌ చేస్తే ఈ వివరాలు తెలుస్తాయి. ఈ పరిజ్ఞానం లేని వారిని కూడా దృష్టిలో ఉంచుకొని టోల్‌ఫ్రీ నెంబర్‌ ద్వారా కూడా సేవలందించాలని భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు తాము  వెళ్లాల్సిన చిరునామా తెలియజేస్తే ఫోన్‌లో సవివరంగా తెలియజేస్తారు. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

కేవలం అంకెలే కాకుండా ప్రధాన రహదారి, సెగ్మెంట్‌ తెలిసేలా పొడి అక్షరాలు కూడా ఉండటంతో లొకాలిటీ కూడా తెలుస్తుంది.  చాలామందికి నగరంలోని ఆయా ప్రాంతాల  పేర్లు తప్ప,  స్ట్రీట్‌నెంబర్లు, రోడ్‌ నెంబర్లు తెలియవు. ఈ విధానం ద్వారా అందరికీ ఉపయుక్తంగా బాగుంటుందని భావిస్తున్నారు. కొత్త ఇంటినెంబర్లకు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత వచ్చేందుకు దాదాపు నెలరోజులు పడుతుందని, స్పష్టత రాగానే పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు  జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఎస్‌. దేవేందర్‌రెడ్డి తెలిపారు.

గ్రేటర్‌లో ప్రజా సదుపాయాలైన పబ్లిక్‌ టాయ్‌లెట్లు, బస్‌షెల్టర్లు, ఇంటినెంబర్లపై తగిన సహకారమందించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా( అస్కి)ని కోరిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం ఇంటినెంబర్లకు సంబంధించి వారితో చర్చించారు. ఈ విధానం అన్ని రకాలుగా బాగుంటుందనే అభిప్రాయాలు వెలువడటంతో దీన్ని ఖరారు చేశారు. ఈ విధానంలో నగరంలో ప్రతి వందమీటర్ల దూరాన్ని ఒక సెగ్మెంట్‌గా గుర్తిస్తారు.

మొత్తం ఎనిమిది డిజిట్లలో ఉండే ఇంటి చిరునామాలో ప్రతి రెండు డిజిట్లు దిగువ వివరాల్ని తెలుపుతాయి.
మొదటి రెండు డిజిట్లు  :  ప్రధాన రహదారి పేరు పొడి అక్షరాల్లో
తర్వాతి రెండు డిజిట్లు   :  సెగ్మెంట్‌ పేరు పొడి అక్షరాల్లో
మలి రెండు డిజిట్లు       :  భవనం/ అపార్ట్‌మెంట్‌ నెంబరు
చివరి రెండు డిజిట్లు      :  యూనిట్‌ (ఇంటి) నెంబరు
–  ఇండిపెండెంట్‌ ఇళ్ల చిరునామాలో భవనం/అపార్ట్‌మెంట్‌ స్థానంలో జీరోలుగా పేర్కొంటారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement