house numbers
-
ఇల్లెక్కడో చెప్పరూ!
గ్రేటర్లో ‘ఇంటి చిరునామా’ చిక్కడం లేదు. ఏదైనా వీధికి వెళ్లి ఓ ఇంటి అడ్రస్ పట్టుకోవడం గగనమవుతోంది. ఇంటి నెంబర్‌తో సహా పూర్తి చిరునామా ఉన్నా...ఆ ఆనవాళ్లు మాత్రం ఆయా ప్రదేశాల్లో దొరకడం లేదు. గజిబిజి గల్లీలు.. క్రమపద్ధతిలో లేని వీధి నెంబర్లు, గందరగోళం కాలనీలు, ఒక్క డోర్ నెంబరుతోనే ఎన్నోఆబ్లిక్లను చేర్చుతూ పెరిగిపోయిన అదనపు ఇళ్లే ఇందుకు కారణం. 40 ఏళ్ల క్రితం నాటి డోర్ నెంబర్లే ఇంకా కొనసాగిస్తుండడం..కొత్తపద్ధతుల్లో ఇంటి నెంబర్లు వేయక పోవడం వల్ల సిటీజనులు నానా పాట్లు పడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో : విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ వివిధ అంశాల్లో నెంబర్‌వన్‌గా నిలుస్తోంది. అయినప్పటికీ.. నగరంలో చిరునామా తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఇంటి నెంబరుతో సహా పూర్తి చిరునామా ఉన్నా గ్రేటర్లో కావాల్సిన ఇంటిని వెతుక్కోలేక ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నలభయ్యేళ్ల నాటి ఇంటినెంబర్ల తీరులో ఇంతవరకు మార్పురాలేదు. ఈ దుస్థితి తప్పించేందుకు ఆధునిక ఇంటి నెంబర్లను అమలు చేసేందుకు దశాబ్దం క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినా, ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది. పూర్తిస్థాయి సర్వేనే జరగలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక..అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని డిజిటల్ ఇంటినెంబర్లను తెరపైకి తెచ్చారు. టెండర్ల దశ వరకొచ్చినా ఇవి టెండరుదార్లలో ఒకరు కోర్టుకెళ్లడంతో పెండింగ్‌లో పడింది. తాజాగా తిరిగి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. టెండర్లు పూర్తయి, ఎంపికైన సంస్థ గ్రేటర్‌లోని 21 లక్షల ఇళ్ల సర్వే పూర్తిచేసి..కొత్త డిజిటల్ ఇంటినెంబర్లు అందుబాటులోకి తేవడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దశాబ్దానికి పైగా.. దాదాపు దశాబ్దం క్రితమే నగరంలోని ఇళ్లు, రోడ్లు, వీధుల పేర్లు, నెంబరింగ్కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వివిధ నగరాల్లోని ఇంటినెంబర్ల తీరును పరిశీలించిన ఈ విభాగం నగరానికి అనుకూలమైన విధానానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వీధి ప్రారంభంలో ఇంటినెంబర్లను సూచించే సైన్‌బోర్డులు వాటిపై ప్రాంతం(లొకాలిటీ)పేరు, వీధినెంబరు, వీధిలో ఎన్ని ఇళ్లున్నాయో తెలిసే ఏర్పాట్లు చేశారు. అప్పట్లో 647 లొకాలిటీలను గుర్తించినప్పటికీ, కేవలం 3 లొకాలిటీల్లో మాత్రం కొత్త ఇంటినెంబర్లు వేశారు. ఇంటినెంబర్ల పేరిట దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. పథకాన్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల క్రితం ఆధునిక డిజిటల్ నెంబర్ల కోసం టెండర్లు పిలిచారు. టెండరుదార్లలో ఒకరు కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది. తిరిగి మరోమారు కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అంతలోనే ప్రపంచబ్యాంకు నిధులతో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఇంటినెంబర్ల ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సంబంధిత అధికారి తెలిపారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీలోనూ సర్వే చేపట్టనున్నారు. డిజిటల్ నెంబర్లు అందుబాటులోకి వస్తే నగరంలోని ఏ ఇంటి చిరునామానైనా తేలిగ్గా కనుక్కోవచ్చు. ఉపయోగాలెన్నో.. డిజిటల్ ఇంటినెంబర్ల విధానం విద్యుత్, జలమండలి, పోస్టల్, కొరియర్ తదితర సంస్థలకు ప్రయోజనకరం. సులభంగా చిరునామాకు చేరుకోవచ్చు. ఆయా సంస్థలందించే ఆధార్‌తో సహా అనుసంధానిస్తే బకాయిదారులు ఎక్కడికీ తప్పించుకోలేరని జీహెచ్ఎంసీలోని ఓ అధికారి పేర్కొన్నారు. తద్వారా జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సుల ఫీజుల్ని నూరు శాతం వసూలు చేసే వీలుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు పోలీసు, ఫైర్ సర్వీసు, అంబులెన్సులు త్వరితంగా చేరుకోవచ్చు. ♦ దేశంలో బెంగళూరు, విజయవాడల్లో మాత్రమే ఇప్పటి వరకు డిజిటల్ నెంబర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ♦ జీహెచ్ఎంఈలో ఆధునిక ఇంటినెంబర్ల ప్రక్రియను ప్రారంభించినప్పుడు 18 సర్కిళ్లుండగా, 30కి పెరిగాయి. ఇళ్లు కూడా లక్షల సంఖ్యలో పెరిగాయి. ప్రస్తుతమున్న 5 జోన్లు ఇంకా పెరగనున్నాయి. క్లౌడ్‌బేస్డ్ టెక్నాలజీతో డిజిటల్ నెంబర్లు ♦ యూనిక్ స్మార్ట్ అడ్రసింగ్ సొల్యూషన్ ఫర్ అర్బన్ డ్వెలింగ్స్ (యూఎస్ఏఎస్యూడీ)గా పిలిచే ఈ ప్రాజెక్ట్‌లో క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీని వినియోగించుకుంటారు. ♦ మొబైల్ ఫోన్/ ఆన్లైన్ ద్వారా సైతం ఈజీగా చిరునామా తెలిసేలా స్మార్ట్ విధానంలో డిజిటల్ ఇంటినెంబర్లను వినియోగంలోకి తేవడం లక్ష్యం. ♦ అన్ని ఇళ్ల æ అడ్రస్‌లు తేలిగ్గా తెలుసుకునేలా, జీపీఎస్ ,గూగుల్ మ్యాప్స్ ద్వారా నేవిగేషన్ ఉండేలా ప్రాజెక్ట్ పూర్తిచేయాలి. ♦ పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏజెన్సీ దాదాపు ఏడాదిన్నర క్రితం గగన్‌మహల్‌లోని 500ఇళ్లకు డిజిటల్ ఇంటినెంబర్లను ఇచ్చింది. నగరవ్యాప్తంగా అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచేలోగా రాష్ట్రమంతా చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో బ్రేక్‌పడింది. ♦ జీహెచ్ఎంసీ విస్తీర్ణం దాదాపు 625 చ.కి.మీలు కాగా 21 లక్షల ఇళ్లున్నట్లు అంచనా. ♦ సర్వే కోసం ఒక్కో ఇంటికి దాదాపు రూ.40 అంచనాతో టెండర్లు అహ్వానించనున్నట్లు సమాచారం. 21 లక్షల ఇళ్ల చిరునామాలు.. ♦ అన్ని రహదారులు, వీధులు, తదితరమైన వాటిని శాటిలైట్ చిత్రాలతో సహా బేస్ మ్యాప్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను సమగ్ర సర్వే నిర్వహిస్తారు. సర్వేలో భాగంగా , ఇంటికి దగ్గర్లోని ప్రముఖ ప్రాంతం, వీధిపేరు, సబ్లొకాలిటీ, లొకాలిటీలతో పాటు పిన్‌కోడ్ నెంబర్ కూడా సేకరించాలి. ♦ ఖాళీ ప్లాట్లను సైతం గుర్తించి నెంబర్లు ఇస్తారు. ఇంటి నెంబర్లు అస్తవ్యస్తం జీహెచ్ఎంసీ అధికారులు కేటాయించిన ఇంటినెంబర్లు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంటి నెంబర్ల ఆధారంగా చిరునామా కనుక్కోవడం ఇబ్బందికరంగా పరిణమించింది. ఎంసీహెచ్ హయాంలో కేవలం 4 నెంబర్లతో కూడిన నెంబర్ల కేటాయింపు మాత్రమే సహేతుకంగా ఉండేది. 1970 నుంచి జరుగుతున్న ఇంటినెంబర్ల కేటాయింపులో ఎంతమాత్రం క్రమపద్ధతి లేదు. – నగరపు శ్యాం, అధ్యక్షుడు ఇందిరానగర్ కాలనీ సంక్షేమ సంఘం (సీతాఫల్మండి డివిజన్) -
ఇక స్పష్టంగా ఇంటి నెంబర్లు
► డిజిటల్ సిస్టమ్‌కు శ్రీకారం ► లొకాలిటీ తెలిసేలా జాగ్రత్తలు ► అక్షరాలు, అంకెలు కలిసి మొత్తం 8 డిజిట్లు ► కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేనివారి కోసం టోల్‌ఫ్రీ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఇళ్ల నెంబర్లను కనుక్కోవడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో ఇప్పటికే పలు కథలు..విమర్శలు ప్రచారంలో ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటి నెంబర్ల గజిబిజికి స్వస్తి చెప్పేందుకు జీహెచ్ఎంసీ అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. ఇప్పటికే రెండుమూడు రకాల ప్రణాళికలు రూపొందించి, కొంతమేర పనులు కూడా చేశారు. ఒక దశలో లొకాలిటీ, వీధి నెంబరు, ఇంటినెంబర్లతోనే సులభంగా కనుక్కునేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రెండు సర్కిళ్లలో ఇంటినెంబర్ల ప్లేట్లు కూడా బిగించారు. అనంతరం, మారుతున్న ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా జిప్పర్ కోడ్‌ను అమలు చేయాలని భావించారు. గగన్‌మహల్‌లో ప్రయోగాత్మకంగా దానిని ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా అటు డిజిటల్‌గా ఉండేలా, ఇటు డిజిటల్ వినియోగం తెలియని వారికి సైతం తెలిసేలా ఉభయతారకంగా కొత్త విధానాన్ని అమలు చేయాలని భావించారు. ఈ కొత్త విధానం ద్వారా ఆన్లైన్ సదుపాయం కలిగిన వారు ఏ చిరునామాను కనుక్కోవాలన్నా తాము ఎక్కడ ఉన్నది తెలియజేస్తే చాలు ఎక్కడి నుంచి ఎటు వెళ్లాలి.. రమారమి ఎంత దూరం ఉంటుంది.. ఎంత సమయంలో చేరుకోవచ్చు వంటి వివరాలను గూగుల్‌మ్యాప్స్ తరహాలో ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. దీంతోపాటు జీఐఎస్ నేవిగేషన్ కూడా ఉంటుంది. కంప్యూటర్లో కానీ, స్మార్ట్‌ఫోన్‌లో కానీ సంబంధిత చిరునామాను ఎంటర్ చేస్తే ఈ వివరాలు తెలుస్తాయి. ఈ పరిజ్ఞానం లేని వారిని కూడా దృష్టిలో ఉంచుకొని టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా కూడా సేవలందించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు తాము వెళ్లాల్సిన చిరునామా తెలియజేస్తే ఫోన్లో సవివరంగా తెలియజేస్తారు. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం అంకెలే కాకుండా ప్రధాన రహదారి, సెగ్మెంట్ తెలిసేలా పొడి అక్షరాలు కూడా ఉండటంతో లొకాలిటీ కూడా తెలుస్తుంది. చాలామందికి నగరంలోని ఆయా ప్రాంతాల పేర్లు తప్ప, స్ట్రీట్నెంబర్లు, రోడ్ నెంబర్లు తెలియవు. ఈ విధానం ద్వారా అందరికీ ఉపయుక్తంగా బాగుంటుందని భావిస్తున్నారు. కొత్త ఇంటినెంబర్లకు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత వచ్చేందుకు దాదాపు నెలరోజులు పడుతుందని, స్పష్టత రాగానే పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి తెలిపారు. గ్రేటర్లో ప్రజా సదుపాయాలైన పబ్లిక్ టాయ్లెట్లు, బస్షెల్టర్లు, ఇంటినెంబర్లపై తగిన సహకారమందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా( అస్కి)ని కోరిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఇంటినెంబర్లకు సంబంధించి వారితో చర్చించారు. ఈ విధానం అన్ని రకాలుగా బాగుంటుందనే అభిప్రాయాలు వెలువడటంతో దీన్ని ఖరారు చేశారు. ఈ విధానంలో నగరంలో ప్రతి వందమీటర్ల దూరాన్ని ఒక సెగ్మెంట్‌గా గుర్తిస్తారు. మొత్తం ఎనిమిది డిజిట్లలో ఉండే ఇంటి చిరునామాలో ప్రతి రెండు డిజిట్లు దిగువ వివరాల్ని తెలుపుతాయి. మొదటి రెండు డిజిట్లు : ప్రధాన రహదారి పేరు పొడి అక్షరాల్లో తర్వాతి రెండు డిజిట్లు : సెగ్మెంట్ పేరు పొడి అక్షరాల్లో మలి రెండు డిజిట్లు : భవనం/ అపార్ట్మెంట్ నెంబరు చివరి రెండు డిజిట్లు : యూనిట్ (ఇంటి) నెంబరు – ఇండిపెండెంట్ ఇళ్ల చిరునామాలో భవనం/అపార్ట్మెంట్ స్థానంలో జీరోలుగా పేర్కొంటారు. -
పైసలిస్తేనే పింఛన్!
సాక్షి, హన్మకొండ : పింఛన్ల వ్యవహారం పంపిణీదారులకు కాసులు కురిపిస్తోంది. జాబితాలో పేర్లు లేకపోవడం, ఉన్నా అచ్చు తప్పులు రావడం, ఆధార్, ఓటరు కార్డులు, ఇంటి నంబర్లు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు అధికారులు ఆసరా పింఛన్లు నిలిపి వేస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదు. జాబితాలో పేరు రావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కొందరు రాజకీయ నాయకులుకూడా రంగ ప్రవేశం చేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పైసలివ్వు.. పింఛన్ పట్టు.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2.70 లక్షల మం ది పింఛన్లు పొందుతున్నారు. ఇటీవల వృద్ధా ప్య, వితంతు, వికలాంగ తదితర పింఛన్ల కో సం పాత, కొత్త వారు కలిపి జిల్లాలో 5.40 లక్ష ల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3.20 లక్షల మందిని అర్హులుగా పేర్కొంటూ అధికారులు మొదటి జాబితా విడుదల చేశారు. సమగ్ర సర్వే సందర్భంగా జరిగిన పొరపాట్లు, ధ్రువీకరణ పత్రాల్లో అచ్చుతప్పులు, సకాలం లో అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిం చకపోవడం వంటి కారణాలతో వేలాది మంది ని అనర్హులుగా ప్రకటించారు. దీనితో సరైన ధ్రు వీకరణపత్రాలు సమర్పిస్తే అర్హుల జాబితాలో పేర్లు చేర్చి ఫించన్లు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనితో జాబితాలో పేర్లు లేని వృద్ధు లు, వితంతువులు, వికలాంగుల దగ్గర నుంచి కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ దరఖాస్తులు మా కివ్వండి త్వరగా కంప్యూటర్లలో పేరు ఎక్కించి పింఛన్ ఇప్పిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. మరికొందరు మాకు డబ్బులు ముట్టచెబితే చాలు అర్హత ఉన్నా లేకున్నా పింఛన్ ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ఇందుకోసం రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు.. రేగొండ మండల పరిధిలో ఏకంగా ఓ సర్పంచి ప్రతీ లబ్ధిదారుని నుంచి రూ.200 వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చిన వారి పేర్లు జాబితాలో ప్రత్యక్షమవుతుండగా.. క్యూ లైన్లలో నిల్చున్న వారి పేరు కానరావడం లేదు. కాగా, పింఛన్‌కు జాబితాలో పేరులేని వ్యక్తుల ఆందోళనను కొంత మంది ద్వితీయ శ్రేణి నేతలు సొ మ్ము చేసుకుంటున్నారు. పింఛన్ ఇప్పిస్తామం టూ పైరవీలు చేస్తున్నారు. ఆపై నేరుగా అధికారులు తయూరు చేసేకంప్యూటర్ గదుల్లోకి వెళ్లి.. గంటల తరబడి కూర్చుని తమ వారి దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నారు. పంపిణీ సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తూ పండుటాకుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉన్నతాధికారు ల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులు దృష్టిసారించి పైరవీకారులపై, పైసలు వసూలు చేస్తున్న సిబ్బంది చర్య తీసుకోవాలి. పింఛన్ త్వరగా ఇప్పించాలని పండుటాకులు కోరుతున్నారు.