‘ఘోరు’కల్లు
‘ఘోరు’కల్లు
Published Sun, Nov 27 2016 11:51 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
- కుంగుతున్న కరకట్టలు
- ఉధృతమవుతున్న లీకేజీలు
- దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఇంజినీర్లు
కర్నూలు సిటీ: కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గోరుకల్లు రిజర్వాయర్‌కు లీకేజీల సమస్య పెను ముప్పుగా మారింది. కరకట్టలు కుంగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గాలేరుకు నీరు ఇచ్చేందుకు పనులను ప్యాకేజీలుగా విభజించారు. 24వ ప్యాకేజీ కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 44వేల క్యుసెక్కుల నీటి సామర్థ్యంతో విస్తరణ కోసం పనులు చేపట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి చేపట్టిన విస్తరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. భానకచర్ల నుంచి 25, 26 ప్యాకేజీల కింద విస్తరణ పనులు జరుగుతున్నాయి. గాలేరు–నగరి సుజల స్రవంతిలో ఓసీ–50 ప్యాకేజీ కింద ఎస్‌ఆర్‌బీసీ కాల్వ 50.22 కి.మీ దగ్గర గోరుకల్లు రిజర్వాయర్ చేపట్టారు. ఈ రిజర్వాయర్ కోసం 1989లో పీవీ నరసింహారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ తరువాత సుమారు 15 ఏళ్ళపాటు ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. తిరిగి వైఎస్‌ఆర్ హయాంలో 2005లో పనులు మొదలు పెట్టి పూర్తి చేశారు.
లీకేజీకి కారణమెవరు..?
గాలేరు–నగరి ప్రధాన కాలువకు నీరు గోరుకల్లు నుంచే వెళ్లాలి. రిజర్వాయర్ కరకట్ట పనుల్లో సున్నపు రాయి కలయికతో ఉన్న మట్టిని వినియోగిం చడం వల్లే› లీకేజీలు అవుతున్నట్లు ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. లీకేజీలపై జల వనరుల శాఖ నిపుణులు ఈఎన్‌సీ, డిజైన్ విభాగం సీఈ, హైడ్రాలిస్టులతో సైతం తనిఖీలు చేయించారు. వారికి కూడా లీకేజీలపై అంతుపట్టక పోవడంతో రిజర్వాయర్ కరకట్టలకు లోడెడ్ బర్మ్‌కు నిపుణుల కమిటీ సూచించింది. ఈ మేరకు 45 కోట్లతో అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించారు. లీకేజీల వల్ల 2 టీఎంసీల నీరు కూడా నింపలేక పోయారు. కరకట్టల కింద భాగాన వస్తున్న లీకేజీల వల్ల ఈ నెల 23వ తేదీన రిజర్వాయర్ వెనుకటి భాగంలో రాక్టో డ్రైన్ కుంగిపోయింది. దీనిపై కొందరు గోరుకల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బివై.రామయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డిలు రిజర్వాయర్‌ను పరిశీలించారు. సీఈ నారాయణరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
ఎలాంటి ప్రమాదం లేదు.
–సుబ్బరాయుడు, ఈఈ ఎస్‌ఆర్‌బీసీ
గోరుకలు రిజర్వాయర్ నుంచి గతంలో నుంచి కొంత నీరు లీకేజీలు అవుతున్నాయి. కొత్తది కాబట్టీ లీకేజీలు రావడం సహజం. గత నెలల కురిసిన వర్షాపు నీరు కరకట్ట మీది నుంచి కింద రావడంతో రాక్టోడ్రైన్ కుంగింది. అయితే ఎలాంటి ప్రమాదం లేదు. దీనిపై సీఈ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. కుంగిన చోట పనులు చేపట్టాం.
Advertisement
Advertisement