కన్నీటి సీమ
కన్నీటి సీమ
Published Thu, Jul 28 2016 12:15 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
– సాగర్‌కు 8 టీఎంసీలు తరలించేందుకు అనుమతి
– మాట తప్పిన ముఖ్యమంత్రి
– కృష్ణా పుష్కరాల్లో నీటి ఇక్కట్లే..
– సాగు, తాగునీటిపైనా ప్రభావం
నాడు..
కృష్ణా డెల్టాకు పట్టిసీమ నుంచి గోదావరి జలాలు ఇస్తున్నాం. రాయలసీమకు కష్ణా జలాలు ఇస్తాం.
– కర్నూలు కలెక్టరేట్‌లో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ
నేడు..
కృష్ణా డెల్టాలో తాగునీటి సమస్య సాకుతో కృష్ణా జలాల తరలింపునకు అదే సీఎం ఆదేశం.
పట్టిసీమతో సీమకు ఒరిగేదేమీ లేదని తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో నిజాయితీ నేతిబీర చందం అనే విషయం తేట తెల్లమయింది. ఇన్నాళ్లు ఆ ప్రాజెక్టు పేరుతో చేస్తున్న ప్రచారంలోని అసలు రంగు బయటపడింది. కష్ణమ్మ సాక్షిగా.. సీమను మోసగించేందుకు ప్రభుత్వం సమాయత్తమయింది.
కర్నూలు(సిటీ):
శ్రీశైలం జలాశయంలోకి ఇప్పుడిప్పుడే వచ్చి చేరుతున్న నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం రాయలసీమపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి జలాశయం శ్రీశైలం ప్రాజెక్టుకు గత ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కనీస నీటిమట్టం(854 అడుగులు) చేరుకోలేకపోయింది. ఈ కారణంగా రాయలసీమకు సాగునీరు అందించే ప్రాజెక్టులకు చుక్కనీరు అందక లక్షలాది ఎకరాల భూమి బీడువారింది. గుక్కెడు తాగునీటి కోసం జిల్లా ప్రజలు చుక్కలు చూడాల్సి వచ్చింది. గత ఏడాది జూన్ 18, 19 తేదీల్లో నిర్వహించిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో నీటి పంపకాల సందర్భంగా శ్రీశైలంప్రాజెక్టులో నీటిని దిగువనున్న ప్రాంతాల అవసరాల దష్ట్యా 790 అడుగుల వరకు తరలించవచ్చని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇందులో భాగంగానే శ్రీశైలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 788 అడుగుల వరకు నీటిని తరలించారు. ఈ ఏడాది కష్ణా పరీవాహక ప్రాంతంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులు నిండటంతో ఇప్పుడిప్పుడే నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. 23 టీఎంసీల నుంచి 32 టీఎంసీలకు చేరుకుంటున్న తరుణంతో మరోసారి రాయలసీమను మోసగిస్తూ తెలంగాణ, కష్ణా డెల్టాలకు ఏపీ ప్రభుత్వం 8 టీఎంసీల నీటి తరలింపునకు కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతి తీసుకుంది. ఫలితంగా డ్యాంలో నీటి మట్టం 790 అడుగుల దిగువకు పడిపోనుంది. ప్రభుత్వ నిర్ణయంతో సీమకు ఈ ఏడాది కూడా సాగు, తాగునీరు అందడం అనుమానమేననే విషయం అర్థమవుతోంది. జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం కానుంది.
పుష్కరాలకు బురదనీరే గతి..
కృష్ణా పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెల 12 నుంచి మొదలు కానున్న ఈ వేడుక నాటికి కృష్ణా నదిలో నీరు ఉంటుందో, లేదోననే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వ చర్యలతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడిప్పుడే జలాశయంలోకి వచ్చి చేరుతున్న నీటిని దిగువకు తరలిస్తే.. మిగిలిన బురద నీటిలోనే భక్తులు మునకలేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ పరిణామాన్ని చూస్తే రాయలసీమలో పుష్కరాల నిర్వహణ ప్రభుత్వానికి ఇష్టం లేదేమోననే అభిప్రాయానికి కారణమవుతోంది.
Advertisement
Advertisement