శ్రీమంతురాలు
అమలాపురం : ఆస్తులను ఎలా కూడబెట్టుకోవాలా అని ఆలోచించే వారున్న ఈ రోజుల్లో.. తన యావదాస్తిని ప్రభుత్వ పాఠశాలకు దానంగా ఇచ్చిన ఆ వృద్ధురాలు నిజంగా దాతృత్వంలోను ‘శ్రీమంతురాలే’. కామనగరువు గ్రామానికి చెందిన గిడ్డి గనికమ్మ రూ.20 లక్షల విలువైన ఐదు సెంట్ల భూమిని, అందులో ఉన్న భవనం సహా చిట్టమ్మచెరువు ప్రాథమిక పాఠశాలకు ఇవ్వాలంటూ పంచాయతీకి దానమిచ్చారు. ఆమె భర్త గతంలోనే చనిపోయారు. సంతానం లేకపోవడంతో ఆమెను బంధువులే ఆదరిస్తున్నారు.
ఆమె ఇంటి సమీపంలో ఉన్న చిట్టమ్మచెరువు పాఠశాలను బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించనున్నుట్టు తెలుసుకున్నారు. ఆ పాఠశాల విద్యార్థుల పరిస్థితి ఏమిటన్న ఆలోచన ఆమెను కదిలించింది. పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని భావించారు. తాను వృద్ధాప్యంలో పూరింట్లోనైనా కాలం వెళ్లదీస్తానని నిర్ణయించుకుని, తనకున్న ఐదు సెంట్ల భూమి, తన ఇంటితో సహా పంచాయతీకి దానంగా ఇచ్చేశారు. తాను బతికుండగానే పాఠశాల భవనాన్ని నిర్మించి, తన పేరు పెట్టాలని కోరారు.
గ్రామస్తుల సన్మానం
కాగా పాఠశాలకు యావదాస్తి దానమిచ్చిన గనికమ్మను శుక్రవారం పాఠశాల ఆవరణలో సర్పంచ్ రాజులపూడి భీముడు అధ్యక్షతన గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథి ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలకు యావదాస్తిని విరాళంగా ఇచ్చిన గనికమ్మ ఆదర్శప్రాయురాలని, ఆమెను తాను దత్తత తీసుకుని, బాగోగులు చూస్తానని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయవెంకటలక్ష్మి మాట్లాడుతూ గనికమ్మ ఈ ఊరిలో పుట్టడం గ్రామస్తుల అదృష్టమని చెప్పారు. గనికమ్మ జీవితాంతం అండగా ఉంటామని గ్రామస్తులు భరోసా ఇచ్చారు.