కాలువలో బాలిక గల్లంతు
కాలువలో బాలిక గల్లంతు
Published Thu, Mar 23 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
కడియం : కొద్దిసేపటిలో 8వ తరగతి పరీక్షలు రాయాల్సిన బాలిక ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతైన సంఘటన కడియంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడియం నుంచి వెంకాయమ్మపేట వెళ్లే రోడ్డులో వెల్ల శ్రీనివాస్, లక్ష్మిలు తమ ఇద్దరి పిల్లలతో నివాసం ఉంటున్నారు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న శ్రీనివాస్, లక్ష్మి ఎప్పటిలాగే పనికి వెళ్లిపోయారు. వారి కుమార్తె వెల్ల భువనేశ్వరి(12) కడియం ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గురువారం మధ్యాహ్నం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. దీంతో 12 గంటల సమయంలో కాలువలో స్నానం చేసేందుకు వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు కాలు జారీ కాలువలో పడిపోయింది. ఈ బాలికతోపాటు ఉన్న మిగతా పిల్లలు కేకలు వేసి పెద్దలను పిలుచుకువచ్చారు. అయితే అప్పటికే బాలిక కాలువలో కొంత దూరం కొట్టుకుపోయింది. సుమారు వంద మీటర్ల వరకు బాలిక చేతులు పైకి కన్పించాయని, ఆ తరువాత కన్పించలేదని నేరుగా చూసిన వారు చెబుతున్నారు. ఆమె కొట్టుకుపోవడాన్ని గమనించి కర్ర అందించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని అక్కడున్న మహిళలు చెప్పారు. ఈలోపు వీరి కేకలు విని అక్కడికి చేరుకున్న కొందరు కాలువలోకి దిగి వెదికేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. కాగా కాలువ నీటి మట్టం తగ్గిస్తే గానీ వెతకడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కూలిపని చేసుకుంటూ పిల్లలను పెంచుకుంటున్నామని, ఈ వార్త విని బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisement