చెరువు వద్ద గాలింపు చర్యలు చేపడుతోన్న గ్రామస్తులు
ఆదోని: పట్టణ జనాభా దాహార్తి తీరుస్తున్న 104 బసాపురం చెరువులో ఆదివారం పర్వతాపురం గ్రామానికి చెందిన మాధవి(11) అనే బాలిక గల్లంతైంది. గేదెలు మేపడానికి వెళ్లిన బాలికకు దాహం వేయడంతో చెరువులోకి దిగింది. కాలు జారడంతో నీళ్లలో పడిపోయింది. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న గేదెలు మేపుతున్న ఓ బాలుడు చెరువులోకి జారి పడిన దృశ్యం చూసి వెంటనే దాదాపు ఒకటిన్నర కిలో మీటరు ఉన్న గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటన గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు లక్ష్మి, మల్లికార్జునతో పాటు గ్రామానికి చెందిన వారు చాలా మంది వెంటనే చెరువు వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న మున్సిపాలిటీ సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. గాలింపు రాత్రి వరకు కొనసాగినా మాధవి జాడ కనిపించలేదు. లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం కాగా మాధవి పెద్ద కూతురు. గేదెలు మేపుతూ చేదోడు వాదోడుగా ఉన్న తమ కూతురు చెరువులో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ కూతురు కోసం రాత్ర కూడా కళ్లల్లో వత్తులు వేసుకుని చెరువు గట్టుమీదే నిరీక్షిస్తున్నారు. సోమవారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment