బాలిక ఆత్మహత్య
బాలిక ఆత్మహత్య
Published Wed, Jul 20 2016 6:48 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
సదాశివనగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలిక జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సదాశివనగర్ మండలం ఉప్పల్‌వాయిలో బుధవారం జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ సుబ్రహ్మణ్య చారి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌వాయికి చెందిన కుమ్మరి రేఖ(16)కు పుట్టినప్పటి నుంచి మూర్చ వ్యాధి ఉంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. పేదకుటుంబానికి చెందిన రేఖ ఆమె తండ్రి బాలయ్య ఇద్దరు కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నారు. బాలయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రాజవ్వకు ముగ్గురు కుమార్తెలు లక్ష్మి, మణెమ్మ, స్వప్నలు ఉన్నారు. కాగా ఆ ముగ్గురి వివాహాలు జరిగాయి. అనంతరం అనారోగ్యంతో 18 ఏళ్ల క్రితం రాజవ్వ మృతి చెందింది. అనంతరం పిట్లం మండలం చిల్లర్గ నుంచి రెండో భార్యగా హన్మవ్వను చేసుకున్నాడు. రేఖ అనే అమ్మాయి జన్మించింది. కొద్ది రోజులకు హన్మవ్వ, బాలయ్యల మధ్య కుటుంబ గొడవలు తలెత్తాయి. రేఖ చిన్న వయస్సులో ఉన్నప్పుడే హన్మవ్వ ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తండ్రి బాలయ్య కుమార్తెను పెంచి పెద్ద చేశాడు. రేఖకు మూర్చ వ్యాధి ఉండడంతో నన్ను చూసే వారు లేరని జీవితంపై విరక్తి చెంది నివాసం ఉంటున్న గుడిసెలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు నివాసపు గుడిసె దగ్ధమైంది. వేడికి తట్టుకోలేక పక్కనే ఉన్న బాత్‌రూమ్‌లోకి పరుగెత్తింది. శరీరం పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలం వద్దనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement