విజే త ట్రోఫీ అందుకుంటున్న ఖమ్మం జట్టు
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. హోరాహోరీగా కొనసాగిన పోటీల్లో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్ స్థానాన్ని నిజామాబాద్ జట్టు దక్కించుకోగా, మూడో స్థానంలో హైదరాబాద్, నాలుగో స్థానంలో వరంగల్ జట్లు నిలిచాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు స్థానిక కార్పొరేటర్ సోబియా సబహత్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమితో కుంగిపోకుండా.. మరింత పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. జిల్లా క్రీడాభివద్ధి అధికారిణి ఇందిర, హన్మకొండ సీఐ అవిర్నేని సంపత్‌రావు, ఒలంపిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కైలాస్‌యాదవ్‌తో పాటు ఇంద్రసేనారెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.