సాక్షి, హైదరాబాద్: భారత క్రీడల్లో గత కొన్నేళ్లుగా వేర్వేరు లీగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ క్రీడాంశాల్లో సాగుతున్న ఈ లీగ్‌లపై అటు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుండగా, ఇటు పలు వ్యాపార వర్గాలు లీగ్‌లతో జత కట్టి తమ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ‘ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్’ నడుస్తోంది. జైపూర్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమైన టోర్నీ 25 వరకు సాగనుంది.
ఇందులో హైదరాబాద్‌కు చెందిన ‘తెలుగు టాలన్స్’ జట్టుకు కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్నారు. అభిషేక్‌కే చెందిన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ టీమ్ ఇప్పటికే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఆడుతోంది. అంతకుముందే ఆయన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో పాటు బాక్సింగ్ లీగ్‌లో కూడా భాగస్వామిగా ఉన్నారు.
క్రీడలపై అభిరుచితో పాటు ఎక్కువ మందికి ఆయా క్రీడాంశాలకు మరింత ప్రాచుర్యం కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు అభిషేక్ రెడ్డి చెప్పారు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్, అందులో తన టీమ్ తెలుగు టాలన్స్ పాత్రకు సంబంధించి వివిధ అంశాలపై అభిషేక్ ‘సాక్షి’తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే...
వరుసగా లీగ్‌లలో జట్లను కొనడంపై...
మొదటి నుంచి నాకు క్రీడలపై అమితాసక్తి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని పెద్ద ఈవెంట్లను అనుసరించేవాడిని. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి పోటీలకు ప్రత్యక్షంగా తిలకిస్తున్న సమయంలో అక్కడి అభిమానులు చూపించే ఆసక్తి, ఆట పట్ల అక్కడ ఉండే క్రేజ్ నన్ను ఆశ్చర్యపర్చాయి.
మన దేశంలో క్రికెటేతర క్రీడల్లో మనం ఇలాంటిది చాలా తక్కువగా చూస్తాం. అయితే లీగ్‌లు రంగప్రవేశం చేశాక ఫ్యాన్స్ కూడా సదరు ఆటవైపు ఆకర్షితులవుతున్నారు. నా ప్రవృత్తి క్రీడలు. అందుకే ఏదో రూపంలో వాటితో జత కట్టాలని భావించాను. వాలీబాల్ లీగ్‌కు వచ్చిన బ్రహ్మాండమైన స్పందన చూసి ఇప్పుడు హ్యాండ్‌బాల్ వైపు వచ్చాం.
హ్యాండ్‌బాల్‌లో లీగ్ అవసరం గురించి...
మన దగ్గర కూడా హ్యాండ్‌బాల్ పోటీలను రెగ్యులర్‌గా చూసే అభిమానులు ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తూ చాలా చోట్ల అది అవుట్‌డోర్ గేమ్‌గా, మట్టి కోర్టులలో కనిపిస్తుంది. కానీ ఆధునిక యూరోపియన్ శైలిలో ఇండోర్ హ్యాండ్‌బాల్ బాగా పాపులర్. అలాంటి ఆటను ఇప్పుడు లీగ్ ద్వారా అందరికీ చేరువ చేస్తున్నాం.
తెలుగు టాలన్స్ ప్రదర్శనపై...
చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే సెమీఫైనల్లోకి అడుగు పెట్టాం. తొలి లీగ్ విజేతగా కూడా నిలుస్తామనే నమ్మకం ఉంది. లీగ్‌లోని ఆరు జట్లలోనూ మా ఒక్క టీమ్‌కే విదేశీ కోచ్ (ఫెర్నాండో న్యూనెస్–పోర్చుగల్) ఉన్నాడు. ఆయన నేతృత్వంలో టీమ్ చాలా బాగా ఆడటమే కాదు, లీగ్‌లో ఒక టీమ్‌ను, ఆటగాళ్లను ఎలా తీర్చిదిద్దాలో కూడా దిశానిర్దేశం చేసేలా కోచింగ్ సాగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఆటగాళ్ల గురించి...
ఈ విషయంలో కొంత నిరాశ ఉన్న మాట వాస్తవం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొందరు చక్కటి హ్యాండ్‌బాల్ ఆటగాళ్లు ఉన్నా... మా లీగ్‌కు తగినట్లుగా కొన్ని ప్రమాణాల ప్రకారం మాకు తగిన ఆటగాళ్లు లభించలేదు. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారడం ఖాయం. లీగ్ కూడా అందుకు సహకరిస్తుంది. ఈసారి జట్టులో హైదరాబాద్‌లో ఆర్మీలో పని చేస్తున్న ఏడుగురు ఏఓసీ ఆటగాళ్లను మాత్రం తీసుకున్నాం.
టీమ్ యజమానిగా ఆర్థిక అంశాలపై...
లీగ్‌లలోకి అడుగు పెట్టేటప్పుడే నాకు దానిపై స్పష్టమైన అవగాహన ఉంది. ఇవి ఇతర వ్యాపారాల్లాగా ఇప్పటికిప్పుడు లాభాలు తెచ్చిపెట్టేవి కావు. మా ఉత్సాహం మాత్రమే టీమ్‌ను నడిపిస్తుంది. అయితే లాభం గురించి బెంగ లేదు. లీగ్‌తో పాటు సదరు క్రీడ కూడా పైస్థాయికి ఎదగడం ముఖ్యం. స్పాన్సర్లు ముందుకు రావడం కూడా సానుకూల పరిణామం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తలపడే గ్లోబల్ టీమ్‌ను తయారు చేయడమే మా లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment