![Vijay Hazare Trophy 2022: Abhishek Reddy, Srikar Bharat Slams Centuries - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/16/Untitled-1.jpg.webp?itok=CoJ6FhIq)
బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తొలి విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 261 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (133 బంతుల్లో 136; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), కోన శ్రీకర్ భరత్ (84 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ 38 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. కమ్ష(18)దే అత్యధిక స్కోరు. అయ్యప్ప 3 వికెట్లు పడగొట్టగా... షోయబ్, హరిశంకర్, ఆశిష్ తలా 2 వికెట్లు తీశారు. పరుగుల పరంగా ఈ టోర్నీ చరిత్రలో ఆంధ్రకిదే పెద్ద విజయం.
తన్మయ్ అగర్వాల్ శతకం...
న్యూఢిల్లీ: సౌరాష్ట్రతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా సౌరాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (120 బంతుల్లో 102; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం సాధించాడు. సంకేత్ 4 వికెట్లు పడగొట్టగా, అనికేత్ రెడ్డికి 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత హైదరాబాద్ 48.5 ఓవర్లలో 5 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (119 బంతుల్లో 124; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (97 బంతుల్లో 83; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 214 పరుగులు జోడించి హైదరాబాద్ విజయాన్ని సులువుగా మార్చగా, తిలక్ వర్మ (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment