నిధులివ్వండి
నిధులివ్వండి
Published Fri, Nov 25 2016 11:11 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
సీఎంను కోరిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు
– ప్రతినిధి బృందంలో జిల్లా నుంచి డోన్, ఆదోని ఎమ్మెల్యేలు
- నియోజకవర్గాల్లో ఓడిన నేతలకు పెద్దపీట వేయడం ఏమిటని ప్రశ్న
- సీఎం సహాయ నిధి విషయంలోనూ శీతకన్ను అంటూ నిలదీత
- తమ పార్టీ మద్దతుదారుల పింఛన్లూ తొలగిస్తున్నారని ఆవేదన
- డోన్‌కు రూ.4 కోట్లు.. ఆదోని, మంత్రాయలం నియోజకవర్గాలకు చెరో రూ.5 కోట్ల నిధులివ్వాలని ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద నిధులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం కోరింది. ఈ మేరకు విజయవాడలో సీఎంను గురువారం కలిసి విన్నవించారు. ప్రతినిధి బృందంలో కర్నూలు జిల్లా నుంచి డోన్, ఆదోని ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డిలు ఉన్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం డోన్ నియోజకవర్గానికి రూ.4 కోట్లు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలకు చెరో రూ.5 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డిలు కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచిన తమకు కనీసం ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా విలువ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తమ లెటర్‌హెడ్స్‌పై సిఫారసు చేస్తే కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) కింద కూడా సహాయం చేయకపోవడం ఏమిటని నిలదీశారు. తమ పార్టీకి మద్దతిస్తున్నారనే నెపంతో అర్హులైన వారి పింఛన్లను కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్‌చార్జీల పాలనలో..
ప్రజల మద్దతుతో గెలిచిన తమను కాకుండా అధికార పార్టీకి చెందిన ఇన్‌చార్జీలకు గౌరవం ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సీఎంకు వివరించినట్టు తెలిసింది. కొత్త పింఛన్ల విషయంలో కూడా ఎమ్మెల్యేలుగా తాము సూచించిన వారికి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య పాలనకు ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికినట్టు సమాచారం. సీఎంఆర్‌ఎఫ్ కింద వచ్చిన చెక్కులను కూడా గెలిచిన ఎమ్మెల్యేలుగా తమతో కాకుండా అధికార పార్టీ ఇన్‌చార్జీలతో ఇప్పిస్తున్నారని వాపోయారు. ఇలాంటి విధానం రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేదని వివరించారు. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా ఎమ్మెల్యేలుగా తమ పేరుతో కాకుండా ఓడిపోయిన వారి పేరు మీద ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిలదీసినట్టు తెలిసింది. ఇప్పటికైనా తమ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులను కేటాయించాలని సీఎంకు నేరుగా ప్రతిపాదనలను అందజేసినట్టు ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాయి ప్రసాద్‌రెడ్డిలు 'సాక్షి'కి తెలిపారు. రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం వంటి పలు అభివృద్ధి పథకాల కోసం డోన్ నియోజకవర్గానికి రూ.4 కోట్లు, ఆదోని, మంత్రాయలం నియోజకవర్గాలకు చెరో రూ.5 కోట్ల మేర కేటాయించాలని పూర్తిస్థాయి ప్రతిపాదనలను సీఎంకు అందజేసినట్టు ఎమ్మెల్యేలు వివరించారు. అదేవిధంగా నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయం చేయాలని కూడా సీఎంను కోరినట్టు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Advertisement