సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నిరంకుశ పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నియోజక వర్గ నిధులపై మంత్రి లోకేశ్ చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. నియోజకవర్గాలకు నిధులిచ్చామని ట్విటర్‌లో చెప్పి ట్విటర్ నాయుడుగా లోకేశ్ వ్యవహరిస్తున్నారన్నారు. ట్విటర్‌లో కాకుండా అమరావతి చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. లోకేశ్ బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీడీపీ సర్కార్ ఫండ్స్‌ను ఎగ్గొట్టిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా నియోజకవర్గ నిధులను దొడ్డి దారిన మళ్లిస్తున్నారని, ముఖ్యమంత్రి సహాయనిధిలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బాధితుల నుంచి పర్సంటేజ్‌లు తీసుకుంటున్నారన్నారు. రోడ్డుపై ప్రమాదంలో గాయపడిన బాధితులను కూడా ఏ పార్టీకి చెందినవారు అని చూస్తున్నారని, ఇది చాలా దారుణమన్నారు. చంద్రబాబు లాలూచీ రాజకీయాలతో ఏపీ నష్టపోతోందని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. నిజాలు మాట్లాడే ధైర్యం టీడీపీ నేతలకు లేదని పేర్కొన్నారు. పోరాటమని ఢిల్లీలో ప్రధానికి షేక్‌హ్యాండ్ ఇచ్చిన మీ లాలూచీ విన్యాసాలు దేశమంతా చూసిందని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. నాలుగేళ్లపాటు ముగ్గురు కేంద్ర మంత్రులు ఉండి విభజన హామీలను నెరవేర్చుకోలేక.. ఈరోజు ఆమరణ దీక్ష అంటే ప్రజలు గుర్తించరా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment