ఎక్కువ నిధులు ఇవ్వండి
– ప్రధాని నరేంద్రమోదీని కోరిన ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ):కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని ఎంపీ బుట్టా రేణుక..ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆమె మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలోని తన నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా కొత్త ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. చేనేత కార్మికులు, ముస్లిం మైనారిటీల సంక్షేమం, పర్యాటక స్థలాల అభివృద్ధి, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించి ఎక్కువ నిధులు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఙప్తి చేశారు. ‘ద నేషనల్ కమిషన్ ఫర్ సోషియల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్’ (ఎన్‌సీఎస్‌బీసీ)కి రాజ్యాంగ హోదా ప్రతిపత్తి కల్పించినందుకు ప్రధాన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఎంపీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది.