- పునరావాస ప్యాకేజీ మా పరిధిలో లేదు
- సింగరేణి డైరెక్టర్ అంటోనిరాజా
పరిహారం మాత్రమే చెల్లిస్తాం
Published Sat, Jul 23 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
లింగాపూర్ (రామగుండం) : మేడిపల్లి ఓపెన్‌కాస్టు బాధిత గ్రామమైన లింగాపూర్ ఎస్సీ కాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించాలనే డిమాండ్‌పై సింగరేణి యాజమాన్యం గోదావరిఖని జీఎం కార్యాలయంలో కాలనీవాసులతో శనివారం సంప్రదింపులు జరిపింది. అంతకు ఒక రోజు ముందే సింగరేణి ఉన్నతాధికారులు ఎవ్వరికీ సమాచారమివ్వకుండా ఎస్సీ కాలనీ స్థితిగతులను పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. తర్వాతే కాలనీవాసులతో సంప్రదింపులకు అవకాశమిచ్చారు. రాబోయే రెండేళ్లలో మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు కాలపరిమితి ముగియనుందని, ఎస్సీ కాలనీవాసులకు పునరావాస ప్యాకేజీ వర్తింపజేయడం సాధ్యం కాదని తేల్చేశారు. మూడు నెలల క్రితం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఆదేశాల మేరకు కాలనీని సర్వేయర్ల బృందంతో పరిశీలించి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో తమకు న్యాయం జరుగనుందని సంతోషపడ్డామని కాలనీవాసులు పేర్కొంటున్నారు. వివిధ రకాల ప్రక్రియలు పూర్తి చేస్తున్నప్పటికీ ఎస్సీ కాలనీవాసులకు పరిహారాలు మాత్రం అందడం లేదని వాపోతున్నారు. ఏదేమైనా తాము శిథిలావస్థకు చేరిన గృహాలకు మాత్రమే పరిహారం చెల్లించనున్నామని, అంతకు మించి ఇతర అంశాలు తమ పరిధిలో లేవని, దీనికి కాలనీవాసులు సమష్టిగా నిర్ణయించుకుంటే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తామని, లేదంటే మీ నిర్ణయం మీదే అంటూ సమావేశాన్ని ముగించినట్లు ఎంపీటీసీ ఇరికిళ్ల పద్మ తెలిపారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్(పా) అంటోనిరాజా, సీజీఎం వెంకటేశ్వర్‌రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉప్పులేటి పర్వతాలు, కన్నూరి సతీశ్‌కుమార్, ఇరికిళ్ల నర్సయ్య, కాసర్ల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement