- భీంబాయి మరణంపై స్పందించిన మహిళా కమిషన్
- జిల్లా పాలనాధికారికి నోటీసు జారీ
- కదిలించిన ‘సాక్షి’ కథనం
నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలి
Published Fri, Sep 23 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
కెరమెరి : మండలంలోని శివగూడ గ్రామానికి చెందిన టేకం భీంబాయి రక్తహీనత కారణంగా ప్రసవంలోనే బిడ్డతో సహా మరణించిన ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని జిల్లా పాలనాధికారికి శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఇదే విషయంలో ఈ నెల 10న లీగల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు శివగూడ గ్రామాన్ని సందర్శించారు. భీంబాయి మతికి గల కారణాలను కుటుంభ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం 13న లీగల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు ‘సాక్షి’ ప్రచురించిన ‘పురిట్లో విషాదం’ కథనాన్ని జోడించి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివాసీ యువతుల్లో తల్లి కావాలంటే భయపడే దుస్థితి నెలకొందని అందులో పేర్కొన్నారు. ఏజెన్సీలో జరుగుతున్న గిరిజన బాలింతల చావుకేకలను ఆపాలని కమిషన్‌ను కోరారు. దీంతో కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో.. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను కోరింది. ఈ విషయాన్ని లీగల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు మాదాసు మధుకర్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. సాధారణంగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే మహిళా కమిషన్ స్పందిస్తుంది. కానీ ఇది ఆదివాసీ మహిళలకు సంబంధించిన విషయం కావడం, ‘సాక్షి’లో ప్రచురించిన కథనం హదయాలను కదిలించేదిగా ఉండడంతో మహిళా కమిషన్ తక్షణమే స్పందించిందని మధుకర్ తెలిపారు.
Advertisement