పాలమూరు టు గోవా
♦ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
♦ జిల్లా మీదుగా తరలిన రైలు
♦ సీనియర్ సిటిజన్ల స్వాగతం
గోవాకు వీక్లి ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్–వాస్కోడిగామ రైలు నాంపల్లి నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రైలు పాలమూరు మీదుగా వెళ్లడంతో ఆ రూట్‌లలో వెళ్లే ప్రయాణికులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి నుంచి ఉదయం 9:20కి బయలుదేరి మహబూబ్‌నగర్ స్టేషన్‌కు 11:57కు చేరుకుంటుంది.
స్టేషన్ మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైల్వే ప్రయాణికులకు శుభవార్త. గోవా వెళ్లడానికి హైదరాబాద్ నుంచే రైలు సౌకర్యం ఉండేది. ప్రయాణికుల సౌకర్యార్థం నాంపల్లి నుంచి గోవాకు దక్షిణమధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసింది. గత నెల 29న ఈ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. గోవాకు వీక్లి ఎక్స్‌ప్రెస్ (17021) హైదరాబాద్–వాస్కోడిగామ రైలు నాంపల్లి నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. నాంపల్లి నుంచి ఉదయం 9:20గంటలకు బయలుదేరిన గోవా రైలు మహబూబ్‌నగర్ స్టేషన్‌కు 11:57గంటలకు చేరుకుంటుంది.
రైలుకు సీనియర్ సిటిజన్ల స్వాగతం
జిల్లా స్టేషన్‌కు చేరుకున్న గోవా రైలుకు స్థానిక స్టేషన్ మేనేజర్ పుష్పరాజ్‌తోపాటు సీనియర్ సిటిజన్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి పూలు దండవేశారు. అనంతరం ప్రయాణికులకు మిఠాయిలు పంచిపెట్టారు. గోవా రైలును వారంలో రెండుసార్లు తిరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గోవా ఎక్స్‌ప్రెస్ రైలు వివరాలు
ఈ గోవా రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్, డోన్, గుంతకల్లు, బళ్లారి, తొరంగల్లు, హోస్పెట్, మునీరాబాద్, కొప్పల్, గద్, అనిగేరి, హుబ్లి, లోండ్‌క్యాస్టిల్‌రాడ్, కుళ్లెం మీదుగా వాస్కోడిగామ(గోవా)కు మరుసటì రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17022) ఉదయం 9గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 7:40 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
ప్రయాణికులకు సౌకర్యం
జిల్లా మీదుగా గోవాకు రైలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. గోవాకు హైదరాబాద్ నుంచి వెళ్లేవారు. టికెట్ ధరలు కూడా తక్కువగాను ఉన్నాయి. ఈ గోవా రైలు వారంలో రెండుసార్లు తిరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహబూబ్‌నగర్ డబ్లింగ్ రైల్వేలైన్‌ను పూర్తి చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళుతుంది.
– మహ్మద్ యాకుబ్, రైల్వే ప్రయాణికుడు
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా మీదుగా గోవా రైలు వెళ్తుంది. ఈ సౌకర్యాన్ని ఇక్కడి ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణమ«ధ్య రైల్వే ఎన్నో వసతులు కల్పిస్తుంది. – పుష్పరాజ్, స్టేషన్ మేనేజర్