చంద్రగ్రహణం | goalmal in input subsidy | Sakshi
Sakshi News home page

చంద్రగ్రహణం

Published Wed, Jul 5 2017 3:38 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

చంద్రగ్రహణం

చంద్రగ్రహణం

ఇన్‌పుట్‌ సబ్సిడీలో లోపించిన పారదర్శకత
- టీడీపీ నేతల దయాదాక్షిణ్యాలపైనే మంజూరు
- అస్మదీయులైతే పొలం లేకున్నా పరిహారం
- జిల్లాలో రూ.వంద కోట్లకు పైగా గోల్‌మాల్‌
- భాగస్వాములవుతున్న వ్యవసాయాధికారులు
- ఇన్సూరెన్స్‌ మంజూరులోనూ అన్యాయమే..


- ఆత్మకూరు మండలం సిద్ధలాపురానికి చెందిన ఎ.లక్ష్మిదేవికి సర్వే నెంబర్‌ 497–3ఏలో పొలం ఉన్నట్లు, అందులో ఆముదం సాగు చేసినట్లు.. ఈ పంటకు నష్టం వాటిల్లినట్లు రూ.13,600 ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారు. నిజానికి ఈమెకు పొలం లేదు. ఇదే సర్వే నెంబర్‌ 497–3ఏలో అదే గ్రామానికి చెందిన కె.కవిత కూడా ఆముదం సాగు చేసి నష్టపోయినట్లు రికార్డులు సృష్టించారు. ఈమెకు రూ.13,600 పరిహారం మంజూరయింది. ఇంతటితో ఆగలేదు. ఇదే సర్వే నెంబర్‌(497–3ఏ)లో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశులు కూడా ఆముదం సాగు చేసి నష్టపోవడంతో రూ.12,240 పరిహారం ఇచ్చారు. ఈయనకూ పొలం లేకపోవడం గమనార్హం. ఈ మండలంలో ఇలాంటి అనర్హులు వేల సంఖ్యలో ఉన్నారు. అయితే వీరికున్న అర్హత.. మంత్రి పరిటాల సునీత అనుచరులు కావడమే!

- బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళా రైతుకు 3.60 ఎకరాల పొలం ఉంది. ఈమె ఖాతాలో(నెంబర్‌:1163) రూ.3వేలు మాత్రమే జమ చేశారు. ఇదే గ్రామంలో డి.ఈశ్వరయ్య అనే మరో రైతు 2.74 ఎకరాల్లో(పట్టా నెంబర్‌.954–డి) పంటసాగు చేసి నష్టపోయారు. ఈయనకు రూ.6వేల ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేశారు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు సూర్యనారాయణ 2.50 ఎకరాల్లో(పట్టా నెంబర్‌.955) పంటసాగు చేసి నష్టపోయారు. ఈయనకు రూ.3వేలు జమ అయ్యింది. ఎకరాకు రూ.6వేలు చొప్పున పరిహారం అందాల్సి ఉన్నా.. అలా జరక్కపోవడానికి వీరంతా అధికార టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలగకపోవడమేనని తెలుస్తోంది.
- ఇదీ జిల్లాలో ఇన్‌పుట్‌ సబ్సిడీ తీరుతెన్ను.

ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ పూర్తిగా అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరుగుతోంది. ఇది ప్రభుత్వ సొమ్ము. నష్టపోయిన రైతులందరికీ దక్కాల్సిన పరిహారం అనే విషయాన్ని విస్మరించి అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు జీహుజూర్‌ అంటున్నారు. పొలం లేని వారికి సర్వే నెంబర్లు, ఖాతాలు సృష్టించి పరిహారం పంచుతున్నారు. పొలం ఉండి, పంటసాగు చేసి నష్టపోయిన వారితో చెలగాటం ఆడుతున్నారు.

సాక్షిప్రతినిధి, అనంతపురం : గత ఏడాది ఖరీఫ్‌లో రైతులు 8.50లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ విస్తీర్ణానికి బ్యాంకర్లు పంట రుణం కూడా అందించారు. అధికారులు మాత్రం 7.17లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు. ఇందులో 5.90లక్షల హెక్టార్లు వేరుశనగ, తక్కిన విస్తీర్ణంలో ఇతర పంటలు నష్టపోయినట్లు లెక్కగట్టారు. బ్యాంకర్లు వేరుశనగకు ఎకరాకు పెట్టుబడి రూ.19,500 అవుతుందని లెక్కగట్టి ఆ మేరకు రుణం మంజూరు చేశారు. ఈ లెక్కన జిల్లాలో సాగైన 6.02లక్షల హెక్టార్ల వేరుశనగకు రూ.2,954 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర పంటలకు మరో రూ.500కోట్ల మేర నష్టం సంభవించింది. ప్రభుత్వం 63 కరువు మండలాలను ప్రకటించింది. కానీ ఇన్‌పుట్‌ సబ్సిడీ మాత్రం రూ.1032.42కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అంటే.. రైతులకు ఎకరాకు 19,500 ఖర్చయితే, ప్రభుత్వం రూ.6వేలు మాత్రమే లెక్కగట్టింది. ఇది ప్రభుత్వం రైతులకు చేసిన మొదటి అన్యాయం. పోనీ ఆ మేరకైనా పరిహారం ఇస్తున్నారా? అంటే అదీ లేదు.

ఆధార్‌ ‘లింకు’ పేరుతో మరో అన్యాయం
ప్రతి రైతుకు 5ఎకరాల వరకూ పరిహారం ఇవ్వాలి. ఈ లెక్కన అత్యధికంగా రూ.30వేల వరకూ రైతులకు పరిహారం దక్కాలి. ఒక రైతుకు ఓ గ్రామంలో 2 ఎకరాల పొలం ఉండి, మరో గ్రామంలో మరో రెండు ఎకరాల పొలం ఉంటే నాలుగెకరాలకు పరిహారం అందాలి. కానీ ఒకే ఆధార్‌కార్డుతో రెండుచోట్ల పొలం ఉందనే కారణంతో పరిహారం ఎగవేస్తున్నారు. దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. టీడీపీ నేతలకైతే పొలం లేకున్నా సర్వే నెంబర్లు, ఖాతాలు సృష్టించి పరిహారం వేస్తున్నారు. ఇందులో వ్యవసాయాధికారులు పూర్తిగా అధికార పార్టీ చెప్పుచేతల్లో నడుచుకుంటూ ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరులో గోల్‌మాల్‌ చేస్తున్నారు. నిజమైన రైతులుంటే వారికి హక్కుగా దక్కాల్సిన పరిహారాన్ని కూడా అందించని పరిస్థితి. ఇలా.. రూ.వంద కోట్లకు పైగా జిల్లాలో గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం రైతు కృతజ్ఞత యాత్ర పేరుతో చంద్రబాబును జిల్లాకు రప్పిస్తున్నారు. కృతజ్ఞత చెప్పాలనే ఆలోచన ‘అనంత’ రైతులెవ్వరికీ లేకపోయినా అధికార పార్టీనేతలు, కార్యకర్తలు పంటసాగు చేయకపోయినా కాసుల పంట పండుతుండటంతో వారు చంద్రబాబుకు కృతజ్ఞత తెలియజేసేందుకు బాబును పిలిపించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.

బీమా మంజూరులో తిరకాసు
21.25లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేందుకు రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకు రికార్డులు చెబుతున్నాయి. ఈ విస్తీర్ణానికి రైతుల నుంచి ప్రీమియం వసూలు చేశారు. కానీ 15.05లక్షల ఎకరాల్లోనే పంట సాగయిందని వ్యవసాయాధికారులు క్రాప్‌బుకింగ్‌ రికార్డుల్లో పేర్కొన్నారు. ఇందులో 14.87లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లిందని బీమా కంపెనీ తేల్చింది. ఈ మొత్తానికి పరిహారం చెల్లించేందుకు బజాజ్‌ కంపెనీ జిల్లాకు రూ.419కోట్ల పరిహారాన్ని చెల్లిస్తోంది. నిజానికి రైతు తీసుకున్న రుణానికి ఇన్సురెన్స్‌ చేశారు. అంటే ఏ మేరకు రుణం తీసుకున్నారో, ఆ మేరకు బీమా మంజూరు కావాలి. ఈ లెక్క రూ.2,500కోట్లకు పైనే అవుతుంది. కానీ బీమా కంపెనీ కేవలం రూ.419కోట్లు మాత్రమే ఇస్తోంది. ఈ మొత్తాన్ని 14.87లక్షల ఎకరాలకు జమ చేస్తున్నారు. తక్కిన 6.37లక్షల ఎకరాలకు పరిహారం ఎవరు చెల్లించాలనేది ప్రశ్నార్థకం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement