గోదావరి మాతకు మహా నీరాజనం
కొవ్వూరు : స్థానిక గోష్పాదక్షేత్రంలో శనివారం రాత్రి గోదావరి మాతకు మహా నీరాజనం సమర్పించారు. దసరా శరన్నవరాత్ర మహోత్సవాలు ముగిసిన తర్వాత వచ్చే ఆశ్వీజ పౌర్ణమి ఎంతో విశిష్టమైనదని గోదావరి నీరాజన సమితి అధ్యక్షుడు కలిగొట్ల కృష్ణారావు పేర్కొన్నారు. చంద్ర బింబాన్ని గో క్షీరంలో దర్శించుకోవడం ద్వారా మంచి ప్రతిఫలం ఉంటుందన్నారు. ఈ పౌర్ణమిని శరత్ పౌర్ణమిగా కూడా పిలుస్తారన్నారు. ఇనగంటి ఉమా రామారావు, కనకదుర్గా, కలిగొట్ల కృష్ణారావు దంపతుల చేతుల మీదుగా ముందుగా గోదావరి మాతకు పూజలు చేశారు. గోదావరిమాతకు సహస్ర నామార్చన చేశారు. సెన్సార్‌బోర్డు సభ్యుడు టీఎన్‌వీ రమణమూర్తి, బొందలపాటి హనుమంతరావు, పమ్మి రవిబాబు, మంత్రిప్రగడ సత్యనారాయణ, వైవీఎస్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి మాతకు నీరాజనం అనంతరం నదిలో దీపాలు విడిచిపెట్టారు.