బంగారం బిస్కెట్లు అపహరణ
బంగారం బిస్కెట్లు అపహరణ
Published Fri, Feb 17 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా బ్యాగ్ నుంచి ప్యాకెట్ మాయం
అన్నవరం : బస్సులో తుని వెళుతున్న ఓ వ్యక్తి బ్యాగ్‌లోని రూ.15 లక్షల విలువైన బంగారం బిస్కెట్లను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటనపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై పార్ధసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి...రాజమహేంద్రవరంలోని భాగ్యలక్ష్మీ జ్యూయలర్స్‌లో పనిచేసే కర్రి అప్పారావు యజమాని దీపక్‌కుమార్ జైన్ ఇచ్చిన బంగారాన్ని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చిరు బంగారు వ్యాపారులకు తీసుకెళ్లి అప్పగిస్తుంటాడు. అదే విధంగా గురువారం ఆ జ్యూయలర్స్‌కు చెందిన 1,200 గ్రాముల బరువు గల 12 బంగారు బిస్కెట్లు గల బ్యాగ్‌ను తునిలోని ఓ వ్యాపారికి అప్పగించేందుకు బయలుదేరాడు. ఉదయం 10.45 గంటలకు రాజమహేంద్రవరం - ఇచ్ఛాపురం బస్సు ఎక్కి అన్నవరంలో 12.45 గంటలకు దిగాడు. అక్కడి నుంచి తుని వెళ్లేందుకు మరో బస్సు ఎక్కాడు. అతడితో పాటు ఆ బస్సులోకి మరో నలుగురు వ్యక్తులు ఎక్కారు. వారు కాకినాడ పోర్టుకు బస్సు వెళుతుండగా అని అడగడంతో కండక్టర్ వెళ్లదని సమాధానం చెప్పాడు. దీంతో వారు బస్సుదిగి వెళ్లిపోయారు. అప్పటికే బస్సు అన్నవరం పాత బస్టాండ్ వరకూ వచ్చేసింది. ఆ నలుగురూ దిగిపోయాక అప్పారావుకు అనుమానం వచ్చి బ్యాగ్ తెరచి చూడగా బంగారం బిస్కెట్లతో ఉన్న ప్యాకెట్ కనిపించలేదు. అతడు కూడా బస్సు దిగి ఆ నలుగురి కోసం గాలించాడు. వారి జాడ లేకపోవడంతో యజమాని దీపక్‌కుమార్ జైన్‌కు సమాచారం అందించాడు. ఆయన సూచనల మేరకు అర్ధరాత్రి 12 గంటలకు అన్నవరం పోలీసులకు అప్పారావు ఫిర్యాదు చేశాడు. ఎస్సై పార్థసారధి కేసు నమోదు చేయగా ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.
చోరీపై పలు అనుమానాలు
ఈ బంగారు బిస్కెట్ల చోరీ ఫిర్యాదుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదుదారుని మాటల్లో అంత స్పష్టత లేకపోవడంతో అతడిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన 1,200 గ్రాముల బంగారం తెచ్చే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడని, కానీ ఫిర్యాదుదారుని మాటల ప్రకారం చూస్తే అతను జాగ్రత్తగా ఉన్నట్టు కనిపించడం లేదంటున్నారు. అతను బంగారం పెట్టిన బ్యాగ్ చూస్తే సులువుగా జిప్ వచ్చేదిగా కనిపించడం లేదంటున్నారు. దగ్గరకు నొక్కినట్టు ఉండే ఆ బ్యాగ్‌ను విడదీసి అప్పుడు జిప్ తీయాల్సి ఉంటుందంటున్నారు. ఆ బ్యాగ్ నుంచి బంగారం చోరీ సులభంగా జరిగే పని కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాగ్ కూడా ఎక్కడా కోసినట్టు లేదని పోలీసులు తెలిపారు. దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు.
Advertisement