క్రీడలతో బంగారు భవిత
-
ఏఎన్‌యూ రెక్టార్ సాంబశివరావు
-
మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం
గుంటూరు రూరల్ : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు భంగారు భవితను పొందవచ్చని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ రెక్టార్ కేఆర్‌ఎస్ సాంబశివరావు తెలిపారు. బుధవారం తాడికొండ మండలం లాం గ్రామంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏఎన్‌యూ అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీలను ఆయన రిబ్బన్ కట్‌చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రీడల పట్ల ఎక్కువ మక్కువ చూపుతారని చెప్పారు. విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చే సరికే క్రీడల కన్నా చదువుపై శ్రద్ధ చూపటంతో నైపుణ్యాలు తగ్గిపోతాయన్నారు. ఏఎన్‌యూ పరిధిలోని కళాశాలల నుంచి మొత్తం 10 టీంలు పోటీల్లో పాల్గొన్నాయి.
ఏఎన్‌యూ, ఎమ్‌ఏ జట్లు విజేత....
మొదటిరోజు జరిగిన నాకౌట్ పోటీలలో పది జట్లు పాల్గొనగా అందులో మొదటి మ్యాచ్ గుంటూరు సెయింట్ ఆన్స్ జట్టు, వైఎ ప్రభుత్వ కళాశాల చీరాలజట్టుతో తలపడగా, చలపతి పార్మసీ కళాశాల జట్టుతో నరసరావుపేటకు చెందిన కృష్ణవేణి కళాశాల జట్టుతో, ఒంగోలుకు చెందిన వాసవి డిగ్రీ కళాశాల జట్టుతో డీఎస్ ప్రభుత్వ కళాశాల జట్టుతో, చిలకలూరిపేటకు చెందిన ఏఎమ్‌జీడిగ్రీ కళాశాల జట్టుతో ఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల జట్టుతో తలపడ్డాయి. ఈ పోటీలలో ఆచార్య నాగార్జున కళాశాల జట్టు, ఎమ్‌ఏ ప్రభుత్వ కళాశాల చీరాల జట్టు గెలుపొందాయి. రేపు జరిగే సెమి పైనల్ పోటీలలో కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు, ఏఎన్‌యూ జట్టుతో, డీఎస్ ప్రభుత్వ కళాశాల జట్టుతో గుంటూరు ప్రభుత్వ కళాశాల జట్టు తలపడనున్నాయి. చలపతి విద్యాసంస్థల అధినేత వైవి ఆంజనేయులు, ప్రిన్సిపల్ డాక్టర్ నాదెండ్ల రామారావు, తదితరులు ఏఎన్‌యూ రెక్టర్ సాంబశివరావును ఘనంగా సన్మానించారు.